ముంబై, ఆగస్టు 5 : డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేని స్థాయికి దిగజారింది. మంగళవారం 22 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ఠాన్ని తాకుతూ తొలిసారి 87.88 వద్దకు పతనమైంది. ఒకానొక దశలోనైతే 87.95 స్థాయికి పడిపోవడం గమనార్హం. ఇటీవలి ట్రేడింగ్‌లలో కోలుకున్నట్టే కనిపించినా.. తిరిగి చతికిలపడింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్లకు దిగుమతిదారుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ రావడం రూపాయిని ఒక్కసారిగా బలహీనపర్చిందని మార్కెట్ విశ్లేషకులు తాజా ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని చెప్తున్నారు. సోమవారం ట్రేడింగ్‌లోనూ రూపీ విలువ 48 పైసలు పడిపోయిన సంగతి విదితమే.
రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను ఆపకపోతే భారత్‌పై మరిన్ని సుంకాలుంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు రూపాయిని ఇంకా ఒత్తిడిలోకి నెట్టాయి. ఇప్పటికే భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఎటూ తేలకపోవడంతో అమెరికాలోకి దిగుమతయ్యే అన్ని భారతీయ వస్తూత్పత్తులపై 25 శాతం సుంకాలను గత వారం ట్రంప్ విధించిన విషయం తెలిసిందే. ఇవి ఈ నెల 7 నుంచి అమల్లోకి రానున్నాయి. అలాగే రష్యాతో వాణిజ్యం దృష్ట్యా జరిమానాలూ ఉంటాయని చెప్పిన సంగతీ విదితమే. ఈ క్రమంలో ట్రంప్ మరోసారి సుంకాల హెచ్చరికలు చేశారు. భారీ ఎత్తున టారీఫ్‌లను విధిస్తామని పేర్కొన్నారు. రాబోయే 24 గంటల్లో కఠినమైన ప్రకటనలే ఉంటాయని హెచ్చరించారు. ఇది కరెన్సీ మార్కెట్లో రూపాయికి నష్టాలను తెచ్చిపెట్టాయి. ఫలితంగా ఇప్పుడు అమెరికాతో భారత్‌కు ట్రేడ్ డీల్ కుదరకపోతే రూపాయి విలువ ఇంకా పడిపోవచ్చన్న ఆందోళనల్ని ఫారెక్స్ ట్రేడర్లు వ్యక్తం చేస్తున్నారు.
డాలర్ ముందు రూపాయి బలహీనపడినకొద్దీ దేశంలోకి జరిగే దిగుమతులు భారంగా మారనున్నాయి. ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న వస్తూత్పత్తులకు డాలర్ల రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది మరి. దీంతో భారతీయ మార్కెట్లో వాటన్నింటి ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ముడి చమురు ధరలు విజృంభిస్తాయి. ఇదే జరిగితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్నాళ్లూ తగ్గిస్తూవస్తున్న వడ్డీరేట్లు తిరిగి పెరగడం ఖాయం. దాంతో రుణ లభ్యత కష్టమై, ఆయా రంగాలు ప్రభావితమవుతాయని, చివరకు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి కుంటుపడే ప్రమాదం ఉందని అంటున్నారు.