ముంబై, జూన్ 20: డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2 నెలలకుపైగా కనిష్ఠ స్థాయిని తాకింది. గురువారం ఫారెక్స్ మార్కెట్లో ఉదయం ఆరంభం నుంచే దేశీయ కరెన్సీ.. అమెరికా డాలర్ ముందు చతికిలపడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఒకానొక దశలో ఆల్‌టైమ్ కనిష్ఠ స్థాయికీ పడిపోయింది. ఏకంగా 27 పైసలు దిగజారి మునుపెన్నడూ లేనివిధంగా 83.68 స్థాయికి వెళ్లింది. అయితే మళ్లీ కోలుకోవడంతో 10 పైసలు బలపడింది. చివరకు బుధవారం ముగింపుతో చూస్తే 17 పైసలు క్షీణించి 83.61 వద్ద స్థిరపడింది. ఈ ఏడాది ఏప్రిల్ 16న కూడా ఇదే స్థాయి వద్ద నిలిచిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం.. రుపీని ప్రభావితం చేసింది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలు.. క్రూడ్ రేట్లను ఎగదోశాయి. ఈ క్రమంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు పెరిగినా ఆ జోష్‌ను రుపీ అందుకోలేకపోయింది. విదేశీ పెట్టుబడులు ఈక్విటీల్లోకి వచ్చినా రుపీపై ఒత్తిడి తగ్గలేదని ఫారెక్స్ ట్రేడర్లు సైతం విశ్లేషిస్తున్నారు. నిజానికి ఉదయం ఆరంభంలో 83.43 వద్ద మొదలైన రుపీ.. ఒకానొక దశలో 83.42కు బలపడింది. బుధవారం 83.44 వద్ద ముగిసిన సంగతి విదితమే.
రుపీ నష్టాలు ఇదే స్థాయిలో కొనసాగితే దేశీయ దిగుమతులపై ఆ ప్రభావం పెద్ద ఎత్తున ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని ఎగదోసి.. దేశ ఆర్థిక వ్యవస్థనే చిక్కుల్లో పడేయగలదు. వాస్తవానికి ఆర్బీఐ.. రుపీ ట్రేడింగ్‌లో జోక్యం చేసుకుంటూనే ఉంటుంది. అయినప్పటికీ దేశ, విదేశీ పరిణామాలు షేక్ చేస్తూనే ఉన్నాయి. అయితే దేశంలో పెరుగుతున్న ఫారెక్స్ రిజర్వులు కొంతలో కొంత ఊరటగా చెప్పుకోవచ్చని మెజారిటీ నిపుణులు మాట.