ముంబై, ఆగస్టు 29 : రూపాయి మారకం విలువ మునుపెన్నడూ లేనివిధంగా ఆల్‌టైమ్ కనిష్ఠానికి దిగజారింది. శుక్రవారం ట్రేడింగ్‌లో తొలిసారి 88 మార్కును దాటేసింది. ఈ క్రమంలోనే డాలర్‌తో పోల్చితే దేశీయ కరెన్సీ వాల్యూ 51 పైసలు పడిపోయి 88.09 వద్దకు చేరింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 5న నమోదైన కనిష్ఠ స్థాయి (87.88) కనుమరుగైపోయినైట్టెంది. ఇక ఒకానొక దశలోనైతే 88.33 వద్దకు క్షీణించడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 10న 87.95 స్థాయికి పడిపోగా.. మళ్లీ ఇప్పుడే అంతకంటే ఎక్కువగా దిగజారింది. అయితే ట్రంప్ టారిఫ్‌లు, భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై కొనసాగుతున్న ఉత్కంఠ, దేశం నుంచి తరలిపోతున్న విదేశీ కరెన్సీ నిధులు.. ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని నిపుణులు ట్రేడింగ్ సరళిని విశ్లేషిస్తున్నారు.
అసలే ట్రంప్ టారిఫ్‌లతో ఉక్కిరిబిక్కిరవుతున్న భారత్‌ను.. రూపాయి విలువ పతనం మరింతగా కుంగదీస్తున్నది. దిగుమతులు ఇంకా భారం కానున్నాయి మరి. దీంతో ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. చివరకు దేశ ఆర్థిక వృద్ధిరేటు బలహీనపడేలా పరిస్థితులు వెళ్తున్నాయి.
దేశంలోని ఫారెక్స్ నిల్వలు మరింత క్షీణించాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో 4.386 బిలియన్ డాలర్లు పడిపోయాయి. దీంతో 690.72 బిలియన్ డాలర్లకు భారత్‌లో డాలర్ నిల్వలు దిగజారినట్టు ఆర్బీఐ శుక్రవారం తెలిపింది.