Robot Tax | న్యూఢిల్లీ, జూన్ 21: రాబోయే బడ్జెట్లో కొత్తగా ‘రోబో ట్యాక్స్’ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ మేరకు ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుండగా, దీన్ని అమల్లోకి తెచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు. దీంతో వృద్ధిరేటు, ఉద్యోగ కల్పన, ఆర్థిక విధానాలు, పెట్టుబడులు, రుణ భారం, ఆహార ద్రవ్యోల్బణం వంటి ప్రధానాంశాలపై ఆయా రంగాల పెద్దలతో, ఆర్థిక నిపుణులతో మంత్రి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ‘రోబో ట్యాక్స్’ పరిశీలన తెరపైకి వచ్చింది.
కృత్రిమ మేధస్సు (ఏఐ) ప్రభావంతో ఇటీవలికాలంలో ఉద్యోగాలు పెద్ద ఎత్తున పోతున్నాయి. బడా కార్పొరేట్ సంస్థలన్నీ మానవ శక్తికి బదులుగా రోబో ఆధారిత శక్తిపై దృష్టి సారిస్తున్న ఫలితమే ఇదంతా. దీంతో ఏఐ కారణంగా కొలువుల్ని కోల్పోయినవారిలో నైపుణ్యం పెంచేందుకు, అందుకయ్యే ఖర్చులకు నిధుల సమీకరణ కోసం ఓ ఆర్థికవేత్త నుంచి వచ్చినదే ఈ ‘రోబో ట్యాక్స్’ ప్రతిపాదన. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పేపర్‌కు అనుగుణంగానే దీన్ని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ఏఐ రాకతో లాభాలున్నా.. భారీగా ఉద్యోగాలు పోతాయని, చాలామందికి ఇది బాధాకరమని ఐఎంఎఫ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అందుకే నైపుణ్యాభివృద్ధి, నిరుద్యోగ బీమా కవరేజీ, వేతన బీమాలతోపాటు ప్రస్తుత కార్పొరేట్ ట్యాక్స్ వ్యవస్థల్ని పునఃసమీక్షించాలని ఐఎంఎఫ్ ప్రపంచ దేశాలకు సలహా కూడా ఇచ్చింది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఏఐతో పెద్ద ముప్పే పొంచి ఉన్నదని ఐఎంఎఫ్ తొలి డిప్యూటీ ఎండీ గీతా గోపీనాథ్ కూడా హెచ్చరించినది తెలిసిందే.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో శుక్రవారం జరిపిన ముందస్తు బడ్జెట్ చర్చల్లో వ్యవసాయ రంగ సంఘాలు, నిపుణులు.. వ్యవసాయ సంబంధిత పరిశోధనలకు ప్రాధాన్యతనివ్వాలని కోరాయి. అలాగే ఎరువుల సబ్సిడీని హేతుబద్ధం చేయాలని, వాతావరణ మార్పులతో తలెత్తుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, వ్యవసాయ రంగ స్థితిస్థాపకతకు తోడ్పడేలా కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పించాలని సూచించాయి. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి కోసం ఈసారి బడ్జెట్లో రూ.20,000 కోట్ల నిధులు కేటాయించాలన్న డిమాండ్లు వినిపించాయి.
మార్కెట్లో మందగించిన డిమాండ్‌ను తిరిగి ఉత్తేజపర్చేందుకు వ్యక్తిగత పన్నులను తగ్గించాలని భారతీయ రిటైలర్ల సంఘం కోరింది. తక్కువ వడ్డీకే రుణాలు, భూముల ధరలపై రాయితీలు, ప్రయోజనాలు ఇవ్వాలన్నది. విద్యుత్తు వంటి మౌలిక సదుపాయాలనూ కల్పించాలన్నది. వ్యవసాయం తర్వాత అత్యధికులు ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారని గుర్తుచేసింది. దుకాణాలు నిరంతరం తెర్చుకునేలా వీలు కల్పించాలన్నది.