న్యూఢిల్లీ, జనవరి 24: గణతంత్ర దినోత్సవం వచ్చిందంటే చాలు ఆన్లైన్, రిటైల్ సంస్థలు భారీ ఆఫర్లను తెరపైకి తీసుకొస్తుంటాయి. ఇదే క్రమంలో వచ్చే సోమవారం రిపబ్లిక్ డే సందర్భంగా ఈ-కామర్ దిగ్గజ సంస్థలతోపాటు రిటైలర్లు కూడా పెద్ద ఎత్తున ఆఫర్లను ఇప్పటికే ప్రకటించాయి. వరుసగా సెలవు రోజులు, వారాంతం కావడంతో కొనుగోలుదారులను ముందుగానే ఆకట్టుకోవడానికి ఇప్పటికే పలు సంస్థలు ఆఫర్లను తెరపైకి తీసుకొచాయి.
ఈసారి మాత్రం సంస్థలు ఏకంగా 50 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నట్టు ప్రకటించాయి. వింటర్ స్టాక్‌ను క్లీయర్ చేసుకోవాలనే ఉద్దేశంతో పాటు నూతన కలెక్షన్లను అందించడానికి డిస్కౌంట్ రూపంలో భారీగా ఇస్తున్నాయి. ముఖ్యంగా ఫ్యాషన్, రిటైల్, మాల్, క్లాథింగ్ ప్రీమియం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అధికంగా డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ-కామర్స్ దిగ్గజాలతోపాటు ఆన్లైన్, రిటైలర్లు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి.