Banking Frauds | ముంబై, డిసెంబర్ 26: బ్యాంకింగ్ మోసాలను అరికట్టడానికి కేంద్రం, రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. రిజర్వుబ్యాంక్ తాజాగా విడుదల చేసిన ఈ నివేదిక ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 18,461 బ్యాంకింగ్ మోసాలు జరిగాయని తెలిపింది. వీటి విలువ రూ.21,367 కోట్లని పేర్కొంది. క్రితం ఏడాది జరిగిన మోసాలతో పోలిస్తే భారీగా పెరగగా, అదే విలువ కూడా ఎనిమిది రెట్లు పెరిగిందని ఈ నివేదికలో వెల్లడించింది. బ్యాంకింగ్ రంగ పనితీరు, కమర్షియల్ బ్యాంకులతోపాటు కో-ఆపరేటివ్ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థల పనితీరు ఆధారంగా సెంట్రల్ బ్యాంక్ ‘ట్రెండ్ అండ్ ప్రొగ్రెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్ ఇండియా 2023-24’ పేరుతో గురువారం ప్రత్యేక నివేదికను విడుదల చేసింది.
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో 18,461 బ్యాంకింగ్ మోసా లు జరిగాయి. వీటి విలువ రూ.21,367 కోట్లు. క్రితం ఏడాది రూ. 2,623 కోట్ల విలువైన 14,480 బ్యాంకింగ్ మోసాలు జరిగాయి. బ్యాంకింగ్ మోసాలు ఆర్థిక వ్యవస్థకు, నిర్వహణ, వ్యాపార రిస్క్, ఆర్థిక స్థిరత్వ చిక్కులతో అనేక సవాళ్లను ఎదుర్కొవాల్సి ఉంటుందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ మోసాలు దశాబ్ద కనిష్ఠ స్థాయికి, వీటి విలువ కూడా 16 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాని వెల్లడించింది. ఈ మోసాల్లో అత్యధికంగా ఇంటర్నెట్, కార్డ్ మోసాల వాటా 44.7 శాతంగా ఉన్నదని, మొత్తం విలువలో వీటి వాటా 85.3 శాతంగా ఉన్నదని పేర్కొంది.
ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అత్యధికంగా మోసాలు జరిగాయని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన మోసాల్లో ప్రైవేట్ రంగ బ్యాంకుల వాటా 67.1 శాతంగా నమోదైంది. కానీ, విలువ పరంగా చూస్తే ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కార్డ్, ఇంటర్నెట్ మోసాలు అధికంగా జరగడంతో వీటి విలువ అధికంగా ఉన్నది. అలాగే గతేడాది ప్రైవేట్, ప్రభుత్వరంగ బ్యాంకులపై రూ.86.1 కోట్ల మేర జరిమానా విధించారు. డిజిటల్ మోసాల్లో అనేక కేసులు కస్టమర్లపై సోషల్ ఇంజనీరింగ్ దాడుల ఫలితంగా ఉన్నప్పటికీ, అటువంటి మోసాలకు పాల్పడేందుకు మ్యూల్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం కూడా వేగంగా పెరుగుతున్నది.
బ్యాంకుల లాభాలు మరింత పెరిగాయి. వరుసగా ఆరో ఏడాది 2023-24లోనూ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 13 ఏండ్ల కనిష్ఠ స్థాయి 2.7 శాతానికి పడిపోవడంతో లాభాలు అంతకంతకు పెరిగాయని ఆర్బీఐ వెల్లడించింది. ఆర్థిక మూలాలు ధృడంగా ఉండటంతోపాటు బ్యాంకుల పనితీరు మెరుగుపడటం ఇందుకు కారణమని విశ్లేషించింది. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల నిరర్థక ఆస్తుల విలువ 32.8 శాతం ఎగబాకి రూ.3,49,6034 కోట్లకు చేరుకున్నాయి. మార్చి 2024 నాటికి దేశవ్యాప్తంగా 12 ప్రభుత్వరంగ బ్యాంకులు ఉండగా, 21 ప్రైవేట్ బ్యాంకులు, 45 విదేశీ బ్యాంకులు, 12 ఎస్ఎఫ్బీలు, ఆరు పీబీలు, 43 ఆర్ఆర్బీలు, రెండు ఎల్ఏబీలు ఉన్నాయి.