న్యూఢిల్లీ, మార్చి 21: ఏమరుపాటుతో ఉన్నారో.. మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్ము మాయమైనట్టే. అమాయకులను మోసం చేసేందుకు అక్రమార్కులు రోజుకో కొత్త దారిని వెతుక్కుంటున్నారు మరి. అందుకే జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఖాతాదారులను హెచ్చరిస్తున్నది. మోసగాళ్ల ఉచ్చులో పడితే క్షణాల్లో లక్షలాది రూపాయలు కోల్పోతారన్నది. కాబట్టి తెలిసినవారికి, తెలియనివారికి విలువైన సమాచారాన్ని ఇవ్వరాదని సూచించింది. ఇంకా ఏమందంటే..
ఆన్లైన్ సేల్స్ వేదికలు
ఆన్లైన్ సేల్స్ వేదికలపై అమ్మకందారులను ఆకర్షిస్తూ మోసాలకు తెగబడుతున్నారు. మీ ఉత్పత్తి నచ్చిందని, చెల్లించడానికి యూపీఐ యాప్ ద్వారా ‘రిక్వెస్ట్ మనీ’ పెట్టాలని కోరుతున్నారు. ఇది నమ్మి యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తే చాలు మాల్వేర్ ద్వారా మీ ఖాతాలోని నగదు.. మోసగాడి ఖాతాలోకి బదిలీ అయిపోతుంది.
ఇంటర్నెట్లో సెర్చింగ్
బ్యాంక్, ఇన్సూరెన్స్ సంస్థలు, ఆధార్ అప్డేషన్ కేంద్రాల కస్టమర్ కేర్ నంబర్ల కోసం ఇంటర్నెట్లో మీరు చేసే అన్వేషణ సైతం ఆర్థిక నష్టాలకు దారితీస్తుంది. తప్పుడు నంబర్లకు కాల్ చేస్తే మోసగాళ్ల వలలో పడినట్టే. సదరు సంస్థల ప్రతినిధులమంటూ మీ కార్డ్ వివరాలు, ఇతర విలువైన సమాచారాన్ని కోరతారు. చెప్తే నష్టపోయినట్టే.
క్యూఆర్ కోడ్ స్కాన్
క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయాలంటూ కస్టమర్లను మోసగాళ్లు తరచూ సంప్రదిస్తూ ఉంటారు. నమ్మి స్కాన్ చేస్తే ఏకంగా మీ ఫోన్ డాటా మోసగాళ్ల చేతికి చిక్కుతుంది. దీంతో మీ ఖాతాలోని నగదును చాలా సులువుగా దోచేస్తారు.
జ్యూస్ జాకింగ్
మొబైల్ చార్జింగ్ పోర్ట్ కూడా మోసాలకు దారి తీస్తుంది. పబ్లిక్ చార్జింగ్ పోర్ట్‌లను వినియోగించి అమాయకుల మొబైల్ ఫోన్లలోకి మాల్వేర్లను పంపిస్తున్నారు. దీంతో పాస్‌వర్డ్‌ల వంటివి మోసగాళ్ల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. కనుక వీలైనంత వరకు ఇంట్లో తప్ప మరెక్కడ మీ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను చార్జింగ్ పెట్టకండి. పబ్లిక్ వైఫైలనూ వాడటం తగ్గించండి.
స్క్రీన్ షేరింగ్ యాప్
ఓ స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కస్టమర్లకు మోసగాళ్లు సందేశాలు పంపుతున్నారు. సదరు యాప్ మోసగాళ్ల నియంత్రణలోనే ఉంటుంది. దీంతో ఆ యాప్ డౌన్లోడింగ్ సమయంలో మీరిచ్చే వివరాలు నేరుగా సైబర్ నేరగాళ్లకే వెళ్తాయి. దీంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్, పేమెంట్స్ యాప్‌లను వినియోగించి నగదును దొంగిలిస్తారు.