RBI | భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైన అదనపు నిధులు లేదా రుణాలు మంజూరు చేసే విభాగంలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తున్నది. కేంద్రీయ బ్యాంక్ ఆటోమేటిక్ స్వీప్ ఇన్, స్వీప్ ఔట్ (ఏఎస్ఐఎస్ఓ) ఫెసిలిటీ పని చేయలేదు. ఫలితంగా ఆర్బీఐ నుంచి వాణిజ్య బ్యాంకులకు నిధులు బదిలీ కాలేదని ఆర్బీఐ ట్రెజరీ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నట్లు సమాచారం.
సాధారణంగా రోజువారీ మనీ మార్కెట్ ఆపరేషన్స్ డేటా ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు వెల్లడించాల్సి ఉన్నా, మంగళవారం లావాదేవీల వివరాలను బుధవారం బయట పెట్టలేదని చెబుతున్నారు. సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు ఆర్బీఐ వర్గాలు కృషి చేస్తున్నాయని సమాచారం. ఈ సాంకేతిక లోపం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రభావం చూపలేదని తెలుస్తున్నది.
స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్), మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్ఎఫ్) విభాగాలు బాగానే పని చేశాయని ఆర్బీఐ వర్గాలు తెలిపాయి. దీనిపై స్పందించేందుకు ఆర్బీఐ వర్గాలు అందుబాటులోకి రాలేదు. కొవిడ్-18 నేపథ్యంలో బ్యాంకులకు రోజువారీ ద్రవ్య లభ్యత ఆపరేషన్ల కోసం ఆర్బీఐ.. ఈ ‘ఏఎస్ఐఎస్ఓ’ ఫెసిలిటీ ప్రారంభించింది.