ముంబై, సెప్టెంబర్ 29 : రిజర్వు బ్యాంక్ తన ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాన్ని ప్రారంభించింది. ఈ సారి సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగాను, లేకపోతే పావు శాతం తగ్గించే అవకాశాలున్నాయనే అంచనాలువెలవడుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని ద్రవ్యపరపతి సమీక్ష కమిటీ తన మూడు రోజుల పాటు సమీక్షించి వడ్డీరేట్లను తన నిర్ణయాన్ని ఈ బుధవారం(అక్టోబర్ 1న) ప్రకటించనున్నది. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, దేశీయ ఎగుమతులపై అమెరికా 50 శాతం టారిఫ్‌ను విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రిజర్వుబ్యాంక్ మూడు విడతలుగా వడ్డీరేట్లను ఒక్క శాతం లేదా 100 బేసిస్ పాయింట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ధరల సూచీ తగ్గుముఖం పట్టడం వల్లనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నది.
కానీ, ఆగస్టు నెలవారి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. అమెరాకి ప్రతీకార సుంకాల విధింపు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సెంట్రల్ బ్యాంక్ వేచి చూసేదోరణి అవలంభించింది. అక్టోబర్ నెల సమీక్షలో ఆర్బీఐ తన రెపోరేటును యథాతథంగా 5.50 శాతంగా కొనసాగించే అవకాశం ఉన్నదని గోల్డ్‌మాన్ చాక్స్ తన నివేదికలో వెల్లడించింది. కానీ, డిసెంబర్ సమీక్షలో మాత్రం పావు శాతం తగ్గి 5.25 శాతానికి దించవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుత పండుగ సీజన్లో వడ్డీరేట్లను తగ్గిస్తే గృహ రుణాలు తీసుకునేవారు గణనీయంగా పెరుగుతారని హౌజింగ్.కామ్ సీఈవో ప్రవీణ్ శర్మ తెలిపారు. మరోవైపు, నూతన జీఎస్టీ అమలులోకి రావడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయని, అక్టోబర్ నెలకుగాను ధరల సూచీ 1.1 శాతానికి పరిమితంకానున్నదని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది.
రిజర్వు బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా శిరిష్ చంద్ర ముర్మును కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం రాజేశ్వర్ రావు వచ్చే నెల 8న పదవీ విరమణ చేయనుండటంతో ఈ స్థానాన్ని ముర్ముతో భర్తి చేయనున్నది. ఈ నియామకానికి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 9న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న ముర్ము..ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగనున్నారు. రిజర్వుబ్యాంక్ చట్టం 1934 ప్రకారం సెంట్రల్ బ్యాంక్‌లో నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉండనుండగా, వీరిలో ఇద్దరు ఆర్బీఐలో పనిచేసేవారికి అవకాశం ఉండగా, మరొకరు కమర్షియల్ బ్యాంకింగ్ రంగం నుంచి, మరొకరు ఆర్థిక వేత్తను నియమించుకోనున్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రాజేశ్వర్ రావు..సెప్టెంబర్ 2020లో మూడేండ్ల కాలానికిగాను నియమితులయ్యారు. ఆ తర్వాత రెండేండ్లపాటు ఆయన పదవికాలాన్ని పొడిగించింది.