Reliance Jio | దేశంలోకెల్లా అతిపెద్ద టెలికం సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో రూ.5,337 కోట్ల నికర లాభం గడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 13 శాతం ఎక్కువ. నికర లాభంలో మార్కెట్ వర్గాల అంచనాలను బ్రేక్ చేసింది. మార్కెట్ వర్గాలు.. రిలయన్స్ జియో రూ.5330 కోట్ల నికర లాభం గడిస్తుందని అంచనా వేశాయి. అయితే ఆదాయం రూ.26 వేల కోట్లు ఉంటుందని భావించినా రూ.25,959 కోట్లకు పరిమితమైంది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో రిలయన్స్ జియో నికర లాభం రూ.4,717 కోట్లు. గత ఆర్థిక సంవత్సర మూడో త్రైమాసికంతో పోలిస్తే చివరి త్రైమాసికంలో రిలయన్స్ జియో నికర లాభం 2.4 శాతం పెరిగింది.
మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ జియో ఆపరేషన్ల ద్వారా సంపాదించిన ఆదాయం 11 శాతం పెరిగింది. 2022-23 మార్చి త్రైమాసికంలో రూ.23,394 కోట్ల ఆదాయం లభించింది. 2023-24 డిసెంబర్ త్రైమాసికంలో రూ.25,368 కోట్లతో 2.3 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. జియో నిర్వహణ లాభం మార్చి త్రైమాసికంలో 26.3 శాతం పెరిగింది. నికర లాభం మార్చి 17.5 శాతంగా నమోదైంది.