Reliance Jio | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికం సంస్థ ‘రిలయన్స్ జియో’ త్వరలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కోసం త్వరలో ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు వెళ్లనున్నదని తెలుస్తున్నది. ఈ ఐపీఓ ద్వారా రూ.55 వేల కోట్ల నిధులు సమీకరించాలన్నది రిలయన్స్ జియో లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇదే జరిగితే దేశంలోనే అతిపెద్ద ఐపీఓ కానున్నదని భావిస్తున్నారు.. ఇప్పటి వరకూ రూ.21 వేల కోట్ల నిధులు సమీకరించిన భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఐపీఓనే అతి పెద్దదిగా ఉంది. వచ్చేనెలలో రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో ‘జియో ఐపీఓ’ గురించి క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే 2025 ప్రారంభంలో జియో ఐపీఓ వస్తుందని విశ్లేషకులను ఉటంకిస్తూ ఓ ఆంగ్ల దినపత్రిక ఒక వార్తాకథనం ప్రచురించింది.
ప్రముఖ బ్రోకరేజీ సంస్థ ‘జెఫరీస్’ అంచనా ప్రకారం జియో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11.11 లక్షల కోట్లు (133 బిలియన్ డాలర్లు) ఉంటుంది. ప్రస్తుత రెగ్యులేటరీ నిబంధనల ప్రకారం ఐపీఓ ద్వారా కనీసం ఐదు శాతం వాటాలను విక్రయించడానికి కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్లు ఉండాలి. దీని ప్రకారం ఐపీఓ ద్వారా రిలయన్స్ జియో రూ.55,500 కోట్ల విలువ గల షేర్లు విక్రయించనున్నదని జెఫరీస్ అంచనా వేసింది.
జియో ప్లాట్ ఫామ్స్ లో ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 67.03 శాతం వాటా ఉంది. వ్యూహాత్మక ఇన్వెస్టింగ్ సంస్థలుగా మెటా, గూగుల్‌లకు 17.72 శాతం, విస్టా ఈక్విటీ పార్టనర్స్, కేకేఆర్, పీఐఎఫ్, సిల్వర్ లేక్, ఎల్ క్యాట్టర్టన్, జనరల్ అట్లాంటిక్, టీపీజీతోపాటు గ్లోబల్ పీఈ ఇన్వెస్టర్స్ సంస్థలకు 15.25 శాతం వాటాలు ఉన్నాయి. ఈ ప్రముఖ సంస్థల నుంచి జియో రూ.1.52 లక్షల కోట్ల నిధులు సేకరించింది. ఐపీఓలో గ్లోబల్ పీఈ సంస్థలు తమ వాటాలను విక్రయిస్తారని తెలుస్తోంది. ఇటీవల జియో తన మొబైల్ టారిఫ్‌లు పెంచడం కూడా ఆ సంస్థ ఐపీఓకు వెళ్లనున్నదని తెలుస్తోంది.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!