న్యూఢిల్లీ, డిసెంబర్ 28: దేశీయ ప్రైవేట్ టెలికం సంస్థలకు కొత్త ఏడాదిలో ప్రధానంగా రెండు సవాళ్లు ఎదురుకావచ్చన్న అంచనాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఆయా టెలికం కంపెనీలు టారీఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. అయితే ఇది రివర్స్ ఫైర్ అయిందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాన టెలికం సంస్థల నుంచి కస్టమర్లు ఇతర సంస్థల్లోకి మారిపోతున్నారు. దీంతో వచ్చే ఏడాదీ ఈ జంపింగ్లుంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ఇప్పటికే రిచార్జ్ ప్లాన్ల ధరలు ఠారెత్తిస్తున్నాయి. అయినప్పటికీ ఖర్చులు పెరిగాయన్న కారణాలతో టెలికం ఆపరేటర్లు ధరల భారాన్ని కస్టమర్లపై మోపుతూనే ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో ధరలు మరింత పెరగడంతో సబ్‌స్ర్కైబర్ల సంఖ్య పెద్ద ఎత్తునే పడిపోయింది. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాల్లో చార్జీలు 10 నుంచి 26 శాతం మేర పెరిగాయి. దీంతో ఆయా సంస్థలు 2.6 కోట్ల కస్టమర్లను కోల్పోయాయని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. మరోవైపు దాదాపు 68 లక్షల కస్టమర్లు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కనెక్షన్‌ను తీసుకున్నట్టు తేలింది. ఇప్పటికీ బీఎస్ఎన్ఎల్ 3జీ సర్వీసులనే ఇస్తుండగా, 4జీ సేవల విస్తరణ పనుల్లో ఉండటం గమనార్హం. అయినప్పటికీ కొత్త కస్టమర్లు వస్తున్నారంటే ధరల భారం ఏ స్థాయిలో ప్రైవేట్ కంపెనీలకు ప్రతికూలంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
శాట్కామ్ల ఎంట్రీతో..
వచ్చే ఏడాది శాటిలైట్ ఆధారిత సేవల సంస్థలతోనూ టెలికం కంపెనీలకు మార్కెట్లో భారీగానే పోటీ ఉండొచ్చన్న అంచనాలున్నాయి. ప్రధానంగా ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ రాకతో ప్రస్తుతం టెలికం సంస్థలకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న డాటా వ్యాపారానికి ఎదురుదెబ్బేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. శాట్‌కామ్ సర్వీసులతో ధరల యుద్ధానికి వీలుందని, డాటా ధరలు ఇంకా పడిపోవచ్చని చెప్తున్నారు. ఇదే గనుక జరిగితే ప్రైవేట్ రంగ టెలికం సంస్థలకు నష్టాలే. 5జీ సేవలను దేశవ్యాప్తంగా విస్తరిస్తూపోతున్న టెల్కోలు.. అందుకోసం రూ.70వేల కోట్లదాకా పెట్టుబడులు పెట్టాయి.