Anil Ambani | రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత అనిల్ అంబానీకి బిగ్ రిలీఫ్ లభించింది. దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ)తో నెలకొన్న వివాదంలో రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సంస్థకు రూ.780 కోట్లు చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ కు ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును కలకత్తా హైకోర్టు సమర్థించిందని పేర్కొంటూ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో రిలయన్స్ ఇన్ఫ్రా తెలిపింది.
పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాలో 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణ కాంట్రాక్టుకు పదేండ్ల క్రితం రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ.3,750 కోట్లకు దక్కించుకున్నది. కొన్ని కారణాలతో ప్రాజెక్టు కార్యరూపం దాల్చకపోవడంతో అభ్యంతరం చెప్పిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్.. తమకు నష్ట పరిహారం కింద కొంత చెల్లించాలని రిలయన్ ఇన్ ఫ్రాను కోరింది. దీంతో దామోదర్ వ్యాలీ కార్పొరేషన్‌పై అనిల్ అంబానీ కోర్టు మెట్లెక్కారు. దీనిపై 2019లో విచారించిన ట్రిబ్యునల్ అనిల్ అంబానీకి అనుకూలంగా తీర్పు చెబుతూ రిలయన్స్ ఇన్ ఫ్రాకు రూ.896 కోట్లు చెల్లించాలని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ)ని ఆదేశించింది. ట్రిబ్యునల్ తీర్పును కలకత్తా హైకోర్టులో సవాల్ చేసిన డీవీసీకి రిలీఫ్ లభించలేదు. ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థించిన కలకత్తా హైకోర్టు.. రిలయన్స్ ఇన్ఫ్రాకు రూ.780 కోట్లు చెల్లించాలని డీవీసీని ఆదేశించింది.