న్యూఢిల్లీ, ఆగస్టు 5: రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఖ్యాతిని సాధించింది. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో భారత్ నుంచి అత్యధిక ర్యాంక్‌ను పొందిన సంస్థగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. 2024కిగాను రిలయన్స్క 86వ స్థానం వరించింది. క్రితం ఏడాది వచ్చిన 88 ర్యాంక్‌తో పోలిస్తే రెండు ర్యాంకులు ఎగబాకి ఈ స్థానం దక్కించుకున్నది. గడిచిన మూడేండ్లలో తన ర్యాంక్‌ను 69 మెరుగుపరుచుకున్నది. 2021లో 155వ స్థానంలో ఉన్న రిలయన్స్..2024లో 86వ స్థానానికి ఎగబాకింది.
గడిచిన 21 ఏండ్లుగా ఫార్చ్యూన్ 500 జాబితాలో రిలయన్స్ ఉండటం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను 108.8 బిలియన్ డాలర్ల ఆదాయంపై 8.4 బిలియన్ డాలర్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు ఈ జాబితాలో భారత్‌కు చెందిన తొమ్మిది సంస్థలకు చోటు లభించగా, వీటిలో ఐదు ప్రభుత్వరంగ సంస్థలు ఉండటం విశేషం. వీటిలో బీమా దిగ్గజం ఎల్ఐసీ తన ర్యాంక్‌ను 12 స్థానాలు మెరుగుపరుచుకొని 95వ స్థానానికి చేరుకున్నది.
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ తన తొలి స్థానాన్ని పదిలపరుచుకున్నది. వరుసగా 11వ సారి ఇదే స్థానంలో కొనసాగుతుండటం విశేషం. అలాగే అమెజాన్ ర్యాంక్ రెండు స్థానాలు ఎగబాకి రెండో స్థానానికి చేరుకున్నది. 2023లో రెండో స్థానంలో ఉన్న సౌదీ అరామ్కో ఈసారి నాలుగో స్థానానికి పడిపోయింది. చైనాకు చెందిన స్టేట్ గ్రిడ్‌కు మూడో స్థానం వరించింది.