Reliance | ఫార్చ్యూన్ 2025 గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భారతీయ కార్పొరేట్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను నిలుపుకుంది. ఫార్చ్యూన్ ర్యాంకింగ్స్ ప్రకారం.. రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజా జాబితాలో 88వ స్థానంలో ఉంది. ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని కంపెనీ గత నాలుగు సంవత్సరాలలో 67 స్థానాలు ఎగబాకింది. ఇది 2021లో 155వ స్థానంలో ఉండేది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 22 సంవత్సరాలుగా ఫార్చ్యూన్ గ్లోబల్ జాబితాలో కొనసాగుతూ వస్తున్నది. ఈ సంవత్సరం భారతదేశం నుంచి తొమ్మిది కంపెనీలు ఫార్చ్యూన్ జాబితాలో చేరాయి.
ఇందులో ఐదు ప్రభుత్వ రంగానికి చెందినవి, నాలుగు ప్రైవేట్ రంగానికి చెందిన సంస్థలు ఉన్నాయి. ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితా మార్చి 31, 2025న, అంతకు ముందు ముగిసే ఆర్థిక సంవత్సరాలకు మొత్తం ఆదాయం ఆధారంగా కంపెనీలను ర్యాంక్ చేస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1,071,174 కోట్ల రికార్డు స్థాయిలో ఏకీకృత స్థూల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 7.1 శాతం ఎక్కువ. ఇది గత సంవత్సరంతో కంటే 2.9 శాతం పెరిగి రూ.183,422 కోట్ల ఎబిట్డా( EBITDA)ను సాధించింది. ఇందులో ఆయిల్-టు-కెమికల్ (O2C), ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్, డిజిటల్ సేవల వ్యాపారాలు వృద్ధిని నమోదు చేశాయి.