న్యూఢిల్లీ, ఏప్రిల్ 25 : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను నికర లాభంలో 2.4 శాతం వృద్ధి చెంది రూ.19,407 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14.34 కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో రూ.18,951 కోట్లు లేదా ప్రతిషేరుకు రూ.14 ఆర్జించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.4 లక్షల కోట్ల నుంచి రూ.2.6 లక్షల కోట్లకు చేరుకున్నది. అలాగే రిలయన్స్‌కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 25.7 శాతం ఎగబాకి రూ.7,022 కోట్లకు చేరుకున్నది. ఒక్కో వినియోగదారుడి నుంచి వచ్చిన ఆదాయం 13.5 శాతం ఎగబాకి రూ.206.2కి చేరుకున్నది. ఏడాది క్రితం ఇది రూ.181.7 కోట్లుగా ఉన్నది. కంపెనీ ఆదాయం 17.7 శాతం వృద్ధితో రూ.33,986 కోట్లు ఆర్జించింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను సంస్థ రూ.5.5 తుది డివిడెండ్‌ను ప్రకటించింది.