Reliance | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: వాటాదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) వినాయక చవితి పండుగ కానుకను అందించింది. 1:1 బోనస్ షేర్ల జారీకి ఆ సంస్థ బోర్డు గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో రిలయన్స్ పేర్కొన్నది. ప్రస్తుతం షేర్‌హోల్డర్ల వద్ద ఉన్న రూ.10 విలువైన ప్రతీ ఫుల్ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్‌కు సమాన విలువలో మరో ఫుల్లీ పెయిడ్-అప్ ఈక్విటీ షేర్‌ను ఉచితంగా ఇచ్చేందుకు తమ కంపెనీ బోర్డు సిఫార్సు చేసినట్టు బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్ ప్రకటించింది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ రూ.2,987.15 వద్ద ముగిసింది. బుధవారం ముగింపుతో పోల్చితే 1.41 శాతం దిగజారింది.
రిలయన్స్ ఇన్వెస్టర్లకు ఇలా 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లు దక్కడం గడిచిన ఏడేండ్లలో ఇదే తొలిసారి. ఇంతకుముందు 2017 సెప్టెంబర్‌లో ఇలాగే 1:1 బోనస్ షేర్లను కంపెనీ ఇష్యూ చేసింది. నాడు కంపెనీ షేర్ ధర దాదాపు రూ.700లుగా ఉన్నది. అంతకుముందు 2009-10లో వాటాదారులకు 1:1 బోనస్ షేర్లు దక్కాయి. అయితే తొలి బోనస్ 1980-81లో జారీ అయ్యింది. 3:5 నిష్పత్తిలో ఇచ్చారు.
ఆ తర్వాత 1983-84లో 6:10తో ప్రకటించారు. 1:1 నిష్పత్తిలో మాత్రం తొలిసారి 1997-98లో జారీ చేశారు. మొత్తంగా రిలయన్స్ ఐపీవో దగ్గర్నుంచి ఇన్వెస్టర్లకు ఇది 6వ బోనస్. ప్రస్తుతం దేశీయ అతిపెద్ద కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉన్న విషయం తెలిసిందే.
నిజానికి ఇటీవల నిర్వహించిన కంపెనీ వార్షిక సాధారణ సమావేశంలోనే ఈ 1:1 బోనస్ షేర్ల జారీ ప్రకటన అధికారికంగా వెలువడింది. అయితే తాజాగా జరిగిన బోర్డు సమావేశంలో దానికి ఆమోదముద్ర పడింది. కాగా, ఈ బోనస్ షేర్ల జారీ కోసం రికార్డు తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇదిలావుంటే కంపెనీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్‌ను రూ.15,000 కోట్ల నుంచి రూ.50,000 కోట్లకు పెంచుకోవడానికి కూడా కంపెనీ బోర్డు ఈ సందర్భంగా అనుమతిచ్చింది. దీంతో షేర్‌హోల్డర్ల అనుమతిని సంస్థ కోరుతున్నది.