న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం 1995 (ఈపీఎస్-95) సబ్‌స్ర్కైబర్ల కోసం విత్‌డ్రాయల్ నిబంధనలను సడలించాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) నిర్ణయించింది. 6 నెలల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్న ఈపీఎఫ్‌వో సభ్యులకు ఉపసంహరణ ప్రయోజనాలను ఈపీఎస్ ఖాతాకూ వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) స్కీం సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉన్నది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వంలో 232వ సీబీటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగానే ఈపీఎస్-95లో పలు సవరణలను ప్రతిపాదించారు. కాగా, 34 ఏండ్లకుపైగా ఈ పథకంలో ఉంటున్నవారికి దామాషా పెన్షనరీ ప్రయోజనాలను ఇవ్వాలని కూడా సీబీటీ కేంద్రానికి సిఫార్సు చేసింది. దీంతో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రిటైర్మెంట్ ప్రయోజనాన్ని నిర్ణయించే సమయంలో అధిక పెన్షన్ రానున్నది.