RRB | న్యూఢిల్లీ, నవంబర్ 5: దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగానే ప్రస్తుతం 43గా ఉన్న ఆర్ఆర్బీలను 28కి తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ర్టాల్లో నడుస్తున్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 15 బ్యాంకులను ఇతర బ్యాంకుల్లో విలీనం చేయబోతున్నారు. కాగా, ఆర్ఆర్బీల కార్యకలాపాలను మరింత ప్రభావవంతంగా మార్చడం, ఖర్చుల హేతుబద్ధీకరణే లక్ష్యంగా ఈ విలీనాలకు దిగుతున్నట్టు మోదీ సర్కారు చెప్తున్నది.
ఏయే రాష్ర్టాల్లో..
ఆంధ్రప్రదేశ్‌లో గరిష్ఠంగా 4 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నడుస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో మూడేసి ఆర్ఆర్బీలు పనిచేస్తున్నాయి. ఇక బీహార్, గుజరాత్, జమ్ముకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్ రాష్టాల్లో రెండేసి చొప్పున ఉన్నాయి. దీంతో ఈ రాష్ర్టాల్లోని 26 బ్యాంకుల్లో 15 బ్యాంకుల్ని విలీనం చేయాలని నాబార్డుతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. అయితే తెలంగాణలో మాత్రం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ), తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మధ్య ఏపీజీవీబీ ఆస్తులు, అప్పుల విభజనకు లోబడి ఈ ఆర్ఆర్బీల విలీన ప్రక్రియ సాగనున్నది. కాగా, ఈ నెల 20కల్లా ఈ విలీన ప్రక్రియపై అభిప్రాయాలను తెలియపర్చాలంటూ ఆయా ఆర్ఆర్బీలకు స్పాన్సర్స్‌గా వ్యవహరిస్తున్న బ్యాంక్ అధిపతులకు కేంద్ర ఆర్థిక సేవల శాఖ స్పష్టం చేసింది.
మొదట్లో 196 ఆర్ఆర్బీలు
దేశంలో మునుపు 196 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులుండేవి. అయితే 2004-05 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్బీల నిర్మాణాత్మక విలీన ప్రక్రియను నాటి కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇలా మూడు దశల్లో చేపట్టిన విలీనాలతో దేశవ్యాప్తంగా ఆర్ఆర్బీల సంఖ్య 2020-21 నాటికి 196 నుంచి 43కు తగ్గింది. 1976 ఆర్ఆర్బీ చట్టం కింద ఈ బ్యాంకులన్నీ ఏర్పాటయ్యాయి. చిన్న-సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ప్రాంతాల్లోని కళాకారులకు రుణ, ఇతరత్రా సదుపాయాలను కల్పించాలనే ఉద్దేశ్యంతో వీటిని తెచ్చారు. ప్రస్తుతం ఆర్ఆర్బీల్లో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉండగా, ప్రభుత్వ రంగ స్పాన్సర్డ్ బ్యాంకులకు 35 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15 శాతం చొప్పున వాటాలున్నాయి. కాగా, ఆర్ఆర్బీలను తమతమ స్పాన్సర్డ్ బ్యాంకుల్లోనే విలీనం చేయాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలైన ఏఐబీవోసీ, ఏఐబీఈఏ డిమాండ్ చేస్తున్నాయి.