హైదరాబాద్, అక్టోబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను రూ.1,482.2 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది డాక్టర్ రెడ్డీస్. అమెరికాలో జనరిక్ ఔషధాలకు డిమాండ్ అధికంగా ఉండటం వల్లనే లాభంలో 33.02 శాతం వృద్ధి నమోదైందని పేర్కొంది. ఏడాది క్రితం సంస్థ రూ.1,114.2 కోట్ల లాభాన్ని గడించింది. సమీక్షకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.25 శాతం ఎగబాకి రూ.7,217.6 కోట్లకు ఎగబాకింది.
కంపెనీ నిర్వహణ ఖర్చులు 11.14 శాతం పెరిగి రూ.5,305.1 కోట్లకు చేరాయి. ఈ సందర్భంగా కంపెనీ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..అమెరికాలో జనరిక్ వ్యాపారం అంచనాలకుమించి రాణించడంతోపాటు యూరప్‌లో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకోవడం వల్లనే విక్రయాలు, అటు లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందన్నారు. అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలను విక్రయించడంతో రూ.6,113 కోట్ల ఆదాయం సమకూరింది.