న్యూఢిల్లీ, మే 30: గత ఏడాదిదాకా వడ్డీరేట్ల విషయంలో కఠిన ద్రవ్య విధానాన్ని అనుసరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ఈ ఏడాది మొదలు తమ పాలసీని మార్చుకున్నది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్య సమీక్షల్లో పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) చొప్పున రెపో రేటును అర శాతం (50 బేసిస్ పాయింట్లు) తగ్గించింది. అయితే రాబోయే ద్రవ్య సమీక్షల్లోనూ ఆర్బీఐ ఇదే వైఖరిని ప్రదర్శించవచ్చన్న అంచనాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. జూన్, ఆగస్టుల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున, మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చని అంటున్నారు.
ప్రస్తుతం రెపో రేటు 6 శాతంగా ఉన్నది. నిజానికి కరోనా దెబ్బకు దిగాలుపడిన దేశ ఆర్థిక వ్యవస్థలో నూతనోత్తేజం నింపేందుకు వడ్డీరేట్లను అప్పటి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా తగ్గించుకుంటూపోయారు. అయితే పరిస్థితులు చక్కబడటం, ద్రవ్యోల్బణం విజృంభించడంతో తిరిగి పెంచుకుంటూపోయారు. ఫలితంగా 6.5 శాతానికి చేరింది. ఆ తర్వాత చాలాకాలంపాటు వడ్డీరేట్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. కానీ దాస్ వెళ్తూవెళ్తూ వడ్డీరేట్లు ఇక తగ్గబోతున్నాయన్న సంకేతాలిచ్చారు. దీనికి తగ్గట్టుగానే కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆధ్వర్యంలో నిర్ణయాలు వెలువడుతున్నాయి.
అటు రిటైల్, ఇటు హోల్సేల్ ద్రవ్యోల్బణాలు ఆర్బీఐ ఆమోదయోగ్య స్థాయిల్లోనే ఉండటంతో.. వడ్డీరేట్ల కోతలకే ఆర్బీఐ మొగ్గు చూపుతున్నది. ఈ తరుణంలో వృద్ధిరేటు నిరాశాజనకంగా ఉండటం.. మరింతగా వడ్డీరేట్ల తగ్గింపునకు అవకాశాలనిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను దేశ జీడీపీ వృద్ధిరేటు నాలుగేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 6.5 శాతంగానే నమోదు కావడం.. రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్ల కోతలకు మరింతగా ఆర్బీఐకి వీలు కల్పిస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ఏడాది రెపో రేటు 5-5.25 శాతానికి దిగిరావచ్చన్న అంచనాల్ని కూడా నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. పైగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు..
వాణిజ్య యుద్ధానికి దారి తీస్తుండటంతో ప్రధాన దేశాల రిజర్వ్ బ్యాంకులు వడ్డీరేట్ల కోతల దిశగానే అడుగులు వేస్తున్నాయి. అప్పుడే దేశ జీడీపీ వృద్ధికి బలం చేకూరగలదని భావిస్తున్నాయి. దీంతో భారత జీడీపీ వృద్ధి బలోపేతానికీ వడ్డీరేట్ల తగ్గింపులు ఉండవచ్చని అంటున్నారు. ఇక ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తే వాహన, నిర్మాణ రంగాలకు కొత్త ఉత్సాహం రాగలదని, రుణాలపై వడ్డీభారం తగ్గి ఈఎంఐలు దిగిరావచ్చని కూడా ఆయా వ్యాపార వర్గాలు ఆశిస్తున్నాయి. వాహన, గృహ రుణాలు చౌకగా మారితే అమ్మకాలు పెరుగుతాయని, అప్పుడు అన్నిరకాలుగా దేశ ఆర్థిక వ్యవస్థకూ కలిసొస్తుందని అంటున్నారు.