ముంబై, డిసెంబర్ 7: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగోరోజు నష్టపోయాయి. రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లను మరో 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం, ఈ ఏడాది వృద్ధి అంచనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించడంతో మదుపరులు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో సెన్సెక్స్ బుధవారం నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతుండటం, ఆర్థిక పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటం కూడా మార్కెట్ల పతనానికి ఆజ్యంపోశాయి.
ఆసి యా మార్కెట్లు నిరుత్సాహకరంగా ఉండటంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గుచూపారు. మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 215.68 పాయింట్లు తగ్గి 62,410.68 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 82.25 పాయింట్లు నష్టపోయి 18,560.50 వద్దకు జారుకున్నది. రిజర్వుబ్యాంక్ వడ్డీరేట్లను పెంచుతున్నట్లు ప్రకటించిన మరుక్షణమే సూచీలు భారీగా నష్టపోయాయి.