ముంబై, మే 31: ఇంగ్లాండ్ నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని భారత్‌కు తీసుకొచ్చింది రిజర్వుబ్యాంక్. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇంతటి విలువైన పుత్తడిని ఒకే ఏడాది తీసుకురావడం విశేషం. 1991 తర్వాత ఇంతటి స్థాయిలో బంగారాన్ని తరలించడం కూడా ఇదే తొలిసారి. ఆర్థిక సంక్షోభం కారణంగా గతంలో భారత్ పెద్ద ఎత్తున బంగారాన్ని విదేశాల్లో తనఖా పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతుంటంతో విదేశాల్లో తనఖా పెట్టిన బంగారాన్ని తిరిగి తీసుకోస్తున్నది రిజర్వు బ్యాంక్.
దీంట్లోభాగంగా 2023-24లో ఇంత పెద్ద మొత్తంలో పుత్తడిని తీసుకొచ్చింది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతుండటంతో గతేడాది కొత్తగా 27.46 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ప్రస్తుతం సెంట్రల్ బ్యాంక్ వద్ద 822 మెట్రిక్ టన్నుల బంగారం నిల్వలు ఉండగా, వీటిలో సగానికి పైగా 413.79 టన్నులు విదేశాల్లో నిల్వ ఉంచింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రిజర్వు బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో చాలా దేశాలకు చెందిన కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని నిల్వ చేస్తుంటాయి. ఇదే క్రమంలో భారత్ సైతం అక్కడ పెద్ద మొత్తంలో పసిడిని నిల్వవుంచింది. 2009లో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి కొనుగోలు చేసిన 200 టన్నుల బంగారాన్ని విదేశాల్లో ఉన్న సెంట్రల్ బ్యాంక్‌ల్లో దాచిపెట్టింది. మరోవైపు, బంగారం తీసుకు రావడం వల్ల భారత్‌కు ఒరిగేదేమి లేదని, దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశాలు లేవని కాంగ్రెస్ ప్రతినిధి చిదంబరం విమర్శించారు.