ముంబై, మే 23: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రాబోయే ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షల్లో కీలక వడ్డీరేట్లను పెంచే అవకాశాలేజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువగా ఉన్నాయని మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే నెల జూన్‌లో జరుగబోయే ద్రవ్య సమీక్షలో మాత్రం వడ్డీరేట్ల పెంపు ఉండకపోవచ్చన్న అంచనాలను వ్యక్తం చేస్తున్నారు. ఈసారికి సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును యథాతథంగానే కొనసాగించే వీలుందని అంటున్నారు. ఆ తర్వాత వడ్డింపులేనన్న సంకేతాలనిస్తున్నారు.
ఇదీ సంగతి..
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో సంక్షోభం నెలకొన్న విషయం తెలిసిందే. దాదాపు 3 నెలలుగా జరుగుతున్న ఈ వార్తో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తున్నాయి. దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 90 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్న నేపథ్యంలో పెరుగుతున్న క్రూడాయిల్ రేట్లు.. భారత్‌లో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, వంటగ్యాస్ ధరల్ని పరుగులు పెట్టిస్తున్నాయి. ఫలితంగా అటు రిటైల్, ఇటు హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు పెరిగిపోతున్నాయి. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.48 శాతంగా నమోదవగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 42 నెలల గరిష్ఠాన్ని తాకుతూ ఏకంగా 8.3 శాతంగా రికాైర్డెంది. ఈ క్రమంలో జూన్ ఆరంభంలో జరిగే ఆర్బీఐ ద్రవ్య సమీక్షపైనే అందరి చూపు నెలకొన్నది.
50 పాయింట్లదాకా..
సెప్టెంబర్ లేదా అక్టోబర్ ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్లు పెరుగుతాయని, 25-50 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటు ఎగబాకుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం రెపో రేటు 5.25 శాతంగా ఉన్నది. ఇది ప్రామాణిక వడ్డీరేటు. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు. ఇది పెరిగితే బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను పెంచేస్తాయి. దీంతో గృహ, వాహన, వ్యక్తిగత ఇతరత్రా రుణాలు భారంగా మారుతాయి. ఈఎంఐల చెల్లింపులు పెరుగుతాయి. అలాగే పొదుపునకు పెద్దపీట వేసే అవకాశాలూ ఉంటాయి. ఆర్బీఐ రెపో రేటును పెంచినప్పుడు బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)పై వడ్డీరేట్లను పెంచుతాయి. దీంతో డిపాజిటర్లు తమ సొమ్మును ఆకర్షణీయ వడ్డీ ఆదాయం కోసం ఎఫ్‌డీల్లోకి మార్చేందుకు ఆసక్తి కనబరుస్తారు. కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన పొదుపు పిలుపు నేపథ్యంలో రెపో రేటు పెంపుతో ఆర్బీఐ ఆ దిశగా అడుగులు పడేలా చేయవచ్చన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
కీలక రంగాలు కుదేలే..
దేశంలో వ్యాపార, పారిశ్రామిక రంగాలు ఇప్పటికే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పడిపోయిన ప్రజల కొనుగోలు శక్తితో మార్కెట్లో నీరసం కనిపిస్తున్నది. దీంతో ఉత్పాదకత కూడా మందగించింది. ఈ క్రమంలో ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపు అన్ని రకాల రుణ లభ్యతను మరింత కఠినతరం చేయగలదు. ఇది పారిశ్రామికోత్పత్తిని గట్టిగానే దెబ్బతీస్తుందన్న ఆందోళన ఆయా రంగాల వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. కారణాలెన్నో..
మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల దృష్ట్యా.. భారత ఆర్థిక వ్యవస్థపై అనేక రకాల దుష్ప్రభావాలు పడుతున్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. పెరుగుతున్న ఇంధన ధరలు, విజృంభిస్తున్న ఆహార ద్రవ్యోల్బణం, డాలర్‌తో పోల్చితే జీవనకాల కనిష్ఠాలకు దిగజారుతున్న రూపాయి మారకం విలువ, ఎగుమతులు పడిపోయి భారంగా మారుతున్న దిగుమతులు, వాణిజ్య లోటు, కరెంట్ ఖాతా లోటు, తయారీ రంగంలో మందగమనం.. ఇలా ఎన్నో ఇబ్బందులు చుట్టుముట్టాయని పేర్కొంటున్నారు. గ్లోబల్ మార్కెట్లో పరుగులు పెడుతున్న క్రూడాయిల్ ధరలకు అనుగుణంగా ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, వంటగ్యాస్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే.
గడిచిన పది రోజుల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.5 చొప్పున, కిలో సీఎన్జీ ధర రూ.4 ఎగిసింది. దీంతో పెరిగిన రవాణా ఖర్చులు.. అంతిమంగా అన్ని వస్తూత్పత్తుల ధరల్ని ఎగదోస్తాయని ఆర్థిక విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. దీంతో ధరల అదుపే లక్ష్యంగా ఆర్బీఐ వడ్డీరేట్ల పెంపునకే తొలి ప్రాధాన్యతనిస్తుందని వివరిస్తున్నారు. మే, జూన్, జూలై నెలల్లో రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం గణాంకాలు ఇంకా పెరిగే వీలుందని అంటున్నారు. గల్ఫ్ యుద్ధం ప్రభావం ఇప్పట్లో తొలిగేలా లేదని, కాబట్టి మున్ముందు ద్రవ్య సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను పెంచుతుందని స్పష్టం చేస్తున్నారు.