హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) ఫ్రాంచైజీ తెలుగు బ్లాక్‌హాక్స్ తమ ప్రధాన జట్టులోకి తొలిసారిగా ఓ తెలంగాణ ఆటగాడిని తీసుకుంది. సోమవారం గోవాలో జరిగిన పీవీఎల్ ఐదో సీజన్ ఆటగాళ్ల వేలంలో ఎం. సిరిల్ రెడ్డిని కొనుగోలు చేసింది. వరంగల్‌కు చెందిన సిరిల్ లక్ష రూపాయల ధర పలికాడు. తనీష్ చౌదరిని అత్యధికంగా రూ.14 లక్షలకు కొనుగోలు చేసిన బ్లాక్‌హాక్స్ వినిత్ కుమార్ (రూ. 8 లక్షలు), మోసిన్ (రూ. 5 లక్షలు), హరి ప్రసాద్, దీపక్ (రూ.3 లక్షలు)ను సొంతం చేసుకుంది.
రైట్ టు మ్యాచ్ ద్వారా నియాస్ అబ్దుల్ సలామ్ (రూ.4 లక్షలు)ను తిరిగి దక్కించుకొని జట్టును బలోపేతం చేసుకుంది. ఇక గత సీజన్ వరకూ హైదరాబాద్ బ్లాక్హాక్స్గా కొనసాగిన తమ ఫ్రాంచైజీ పేరును తెలుగు బ్లాక్హాక్స్గా మార్చినట్టు ఆ టీమ్ ప్రిన్సిపల్ ఓనర్ కె. అభిషేక్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ, ఏపీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు సమాజాన్ని వాలీబాల్‌తో ఏకం చేయాలన్న లక్ష్యంలో భాగంగా ఈ మార్పు చేసినట్టు పేర్కొన్నారు.