HDFC Bank | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు ఆర్బీఐ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. డిజిటల్ 2.0 కార్యక్రమం కింద చేపట్టిన హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్యకలాపాలపై విధించిన నిషేధాన్ని ఎత్తేసినట్లు సెంట్రల్ బ్యాంక్ శనివారం తెలిపింది. తమ బ్యాంకుపై నిషేధాజ్ఞలను ఎత్తేసినట్లు శుక్రవారం స్టాక్ ఎక్స్చేంజ్ల ఫైలింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వెల్లడించింది. 2020 డిసెంబర్లో తాత్కాలికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు చేపట్టిన అన్ని రకాల డిజిటల్ కార్యక్రమాలను నిలిపేసినట్లు ఆర్బీఐ పేర్కొంది.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో గత రెండేండ్లుగా కస్టమర్లకు కొత్త క్రెడిట్ కార్డుల జారీ, వివిధ బ్యాంక్ లావాదేవీల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. 2020 నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేమెంట్ యుటిలిటీస్ తదితర సేవల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా, గతేడాది ఆగస్టు నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకుపై విధించిన నిషేధాన్ని పాక్షికంగా ఎత్తేసింది. కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఆర్బీఐ సిఫారసులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడి ఉంటామని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ పేర్కొంది.