వచ్చే ఆర్థిక సంవత్సరం (2024-25) ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) 5.4 శాతంగా ఉంటుందన్నది. కాగా, వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్దే అదుపు చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యం. ఇందుకు 2 శాతం మినహాయింపున్నది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ 6 శాతంగా ద్రవ్యోల్బణం ఉండరాదు. ఒకవేళ ఉంటే దాన్ని తీవ్రంగా పరిగణించి కఠిన ద్రవ్యవిధాన చర్యలకు ఆర్బీఐ దిగాల్సి ఉంటుంది. నిరుడు డిసెంబర్లో 5.7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే.
ఆర్బీఐ నియంత్రణలోని అన్ని బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ సంస్థలు తమ రుణగ్రహీతలకు కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్)ను తప్పనిసరిగా అందించాల్సిందేనని గవర్నర్ దాస్ స్పష్టం చేశారు. అటు రిటైల్, ఇటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకిచ్చే లోన్లకూ ఇది వర్తిస్తుందని చెప్పారు. లోన్ అగ్రిమెంట్, అన్నిరకాల వడ్డీరేట్లు, చార్జీలు, నియమ-నిబంధనలు ఈ కేఎఫ్ఎస్లో సరళమైన భాషలో రుణగ్రహీతలకు సులువుగా అర్థమయ్యేలా ఉండాలని సూచించారు.