HomeBusinessRbi Cuts Repo Rate By Half A Percentage Point
RBI | ఆర్బీఐ డబుల్ ధమాకా.. అర శాతం తగ్గిన రెపో రేటు
RBI | ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మునుపు కఠిన ద్రవ్య వైఖరిని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిరేటు బలోపేతమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది.
50 బేసిస్ పాయింట్లు దిగి 5.50 శాతానికి చేరిక
సీఆర్ఆర్ కోతతో బ్యాంకులకు రూ.2.5 లక్షల కోట్లు
ద్వైమాసిక ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయం
గృహ, వాహన తదితర రుణాలు చౌక
దిగిరానున్న ఈఎంఐల భారం
ఆటో, నిర్మాణ రంగాల్లో ఉత్సాహం
దేశ ఆర్థిక వ్యవస్థకూ జోష్ అంటున్న నిపుణులు
ఆర్బీఐ జంబో రేట్ కట్కు జై కొట్టింది. అంచనాలను మించి ఒకేసారి రెపో రేటుకు 50 బేసిస్ పాయింట్లు కోత పెట్టింది. గడిచిన ఐదేండ్లలో ఈ స్థాయిలో తగ్గించడం ఇదే తొలిసారి. అంతకుముందు రెండు ద్రవ్యసమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల చొప్పున రెపో రేటును దించడంతో మొత్తంగా ఈ ఏడాది మొదలు ఇప్పటిదాకా 1 శాతం తగ్గినైట్టెంది. దీంతో గృహ, వాహన తదితర రుణగ్రహీతలకు భారీ ఊరటే దక్కనున్నది. ఈఎంఐల భారం దిగిరానున్నది మరి.
ముంబై, జూన్ 6: ద్రవ్యోల్బణం అదుపే లక్ష్యంగా మునుపు కఠిన ద్రవ్య వైఖరిని అవలంభించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ).. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధిరేటు బలోపేతమే ధ్యేయంగా ముందుకెళ్తున్నది. కొత్తగా ఆర్బీఐ గవర్నర్‌గా వచ్చిన సంజయ్ మల్హోత్రా.. ఈ ఏడాది మొదలు వడ్డీరేట్ల కోతలే ప్రధానంగా ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలు జరుపుతూ వస్తున్నారు మరి. ఈ క్రమంలోనే ఫిబ్రవరి, ఏప్రిల్ ద్రవ్యసమీక్షల్లో 25 బేసిస్ పాయింట్ల (పావు శాతం) చొప్పున రెపో రేటును తగ్గించిన ఆర్బీఐ.. తాజా ద్రవ్యసమీక్షలో ఏకంగా 50 బేసిస్ పాయింట్లు (అర శాతం) దించేసింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి తగ్గింది.
6 నెలల్లో రెపో రేటు 1 శాతం తగ్గడం విశేషం. బుధవారం మొదలైన జూన్ ద్వైమాసిక ద్రవ్యసమీక్ష శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లోగల ఆరుగురు సభ్యుల్లో మెజారిటీ సభ్యులు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గించాల్సిందేనని నిర్ణయించారు. ఈ మేరకు ద్రవ్యసమీక్ష అనంతరం ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా విలేకరుల సమావేశంలో ప్రకటించారు. కాగా, ఈ ఏప్రిల్‌లో దాదాపు 6 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ రిటైల్ ద్రవ్యోల్బణం 3.16 శాతంగా నమోదు కావడం కూడా ఆర్బీఐ జంబో రేట్ కట్కు దోహదం చేసింది.
రుణగ్రహీతలకు ఊరట
రెపో రేటు తగ్గింపుతో రుణగ్రహీతలకు భారీ ఊరటే దక్కబోతున్నది. బ్యాంకులు తమ రుణాలపై ఈ మేరకు వడ్డీరేట్లను తగ్గించనున్నాయి. ఇది కొత్త రుణాల లభ్యతను పెంచనుండగా, ఇప్పటికే రుణాలు తీసుకున్న వారిపై ఈఎంఐ (నెలవారీ కిస్తీలు) భారాన్ని దించనున్నది. ప్రధానంగా గృహ, ఆటో, వ్యక్తిగత రుణాలకు గిరాకీ ఏర్పడుతుందని మార్కెట్ వర్గాలు, బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నిజానికి ప్రస్తుతం బ్యాంక్ రుణాల వృద్ధి 9.8 శాతానికి పడిపోయింది. అయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఇది మళ్లీ పెరిగే వీలున్నది.
బ్యాంకులకు సీఆర్ఆర్ కిక్కు
బ్యాంకుల చేతికి మరింత నగదును అందించేలా సీఆర్ఆర్ను 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. దీంతో ఈ ఏడాది డిసెంబర్‌కల్లా రూ.2.5 లక్షల కోట్లు అదనంగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాన్నాయి. వ్యవస్థలో నగదు చలామణిని, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకులు వినియోగించే ద్రవ్య విధాన సాధనమే ఈ నగదు నిల్వల నిష్పత్తి లేదా సీఆర్ఆర్ (క్యాష్ రిజర్వ్ రేషియో). ఇందులో భాగంగానే బ్యాంకులు ఆర్బీఐ వద్ద నిర్ణీత స్థాయిలో తమ డిపాజిట్లను పెట్టాల్సి ఉంటుంది.
సీఆర్ఆర్ను పెంచితే బ్యాంకులు ఆర్బీఐ వద్ద మరింతగా డిపాజిట్లను పెట్టాలి. అప్పుడు వాటి దగ్గర ద్రవ్య నిల్వలు పడిపోతాయి. అలాగే సీఆర్ఆర్ను తగ్గిస్తే ఆర్బీఐ వద్ద పెట్టిన డిపాజిట్ల నుంచి బ్యాంకుల చేతికి అదనపు నగదు నిల్వలు అందుతాయి. వ్యవస్థలో ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధిరేటు ఆధారంగా సీఆర్‌ఆర్‌పై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటుంది. ద్రవ్యోల్బణం పెరిగితే వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడానికి సీఆర్ఆర్ను ఆర్బీఐ పెంచుతుంది. అదేవిధంగా వృద్ధిరేటు పురోగతికి నగదు చలామణిని పెంచేందుకు సీఆర్ఆర్ను తగ్గిస్తుంది.
ద్రవ్యసమీక్ష ముఖ్యాంశాలు
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) దేశ జీడీపీ వృద్ధిరేటు అంచనా యథాతథంగా 6.5 శాతం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణం 3.7 శాతంగానే ఉండొచ్చని అంచనా. మునుపు ఇది 4 శాతంగా ఉన్నది.