ముంబై, మే 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర ప్రభుత్వానికి గత అకౌంటింగ్ సంవత్సరానికి (2023-24)గాను అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది. బుధవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నాయకత్వంలో జరిగిన కేంద్ర బోర్డు డైరెక్టర్ల 608వ సమావేశంలో మిగులు నగదు నిల్వల నుంచి మునుపెన్నడూ లేనివిధంగా రూ.2,10,874 కోట్లను డివిడెండ్ రూపంలో ఖజానాకు బదిలీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. అంతకుముందు అకౌంటింగ్ సంవత్సరం (2022-23)తో పోల్చితే ఇది రెట్టింపునకుపైగా ఉండటం గమనార్హం. నాడు రూ.87,416 కోట్లే ఇచ్చింది.
ఇక బడ్జెట్లో అంచనా వేసినదానికంటే కూడా ఇవ్వబోతున్నది చాలాచాలా ఎక్కువే. ఈ ఏడాది ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర బడ్జెట్లో ఆర్బీఐ, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి 2023-24కుగాను రూ.1.02 లక్షల కోట్ల డివిడెండ్లే రావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇందులో ఆర్బీఐ వాటా రూ.50,000 కోట్లలోపే ఉన్నది. అయితే అనూహ్యంగా అంతకు నాలుగు రెట్లు అధికంగా రూ.2 లక్షల కోట్లకుపైగా రాబోతున్నాయి. కాగా, ఇప్పటిదాకా కేంద్రానికి ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్లలో 2018-19 అకౌంటింగ్ సంవత్సరంలో ఇచ్చినదే అత్యధికం. అప్పుడు రూ.1,76,051 కోట్లు ఇచ్చింది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే రికార్డు స్థాయిలో ప్రకటించింది. కాగా, ద్రవ్యలోటు సవాళ్లను కొత్త ప్రభుత్వం అధిగమించడానికి ఆర్బీఐ డివిడెండ్ దోహదం చేస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.