RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కేంద్ర ప్రభుత్వానికి భారీ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025 ఆర్థిక సంవత్సరానికి రూ.2.69 లక్షల కోట్ల భారీ డివిడెండ్‌ను ఇవ్వబోతున్నది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.2.10 లక్షలు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక లోటును 4.4 శాతానికి తగ్గించడంలో మోదీ ప్రభుత్వానికి ఉపయోగపడనున్నది. గత సంవత్సరంలో పోలిస్తే.. 2025 ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్ 37.37శాతం పెరిగింది. కంటింజెన్సీ రిస్క్ బఫర్ (CRB) 6.5 శాతం నుంచి 7.50 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా.. ఆర్బీఐ రూ.3లక్షల కోట్ల వరకు డివిడెండ్‌ను బదిలీ చేసే అవకాశం ఉందని పలు నివేదికలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ఆర్బీఐ, ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థల నుంచి రూ.2.56 లక్షల కోట్ల డివిడెండ్ ఆదాయాన్ని అంచనా వేసింది. శుక్రవారం జరిగిన 616వ సెంట్రల్ బోర్డు సమావేశంలో ఆర్బీఐ అధికారులు, ప్రపంచ-దేశీయ ఆర్థిక పరిస్థితిని సమీక్షించారు. ఇందులో అంచనాలకు వచ్చే నష్టాలున్నాయి.
మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి రూ.2,68,590.07 కోట్ల మిగులును బదిలీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా బోర్డు సీబీఆర్ను పెంచుతున్నది. ఇది మొండి రుణాలు, పడిపోతున్న ఆస్తి విలువలు, సిబ్బంది ఖర్చులు తదితర నష్టాలను కవర్ చేసేందుకు సహాయపడనున్నది. ఈ మొత్తం చెల్లింపుతో 2025-26 ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్లో అంచనా వేసిన రూ. 2.2 లక్షల కోట్లు మించిపోనున్నది. రూపాయి మారక విలువను కాపాడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల రికార్డు స్థాయిలో డాలర్ అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే. 2024 సెప్టెంబర్ ముగింపు నాటికి భారత్ వద్ద రికార్డు స్థాయిలో 704 బిలియన్ డాలర్ల విదేశీ మారకం నిలువలు ఉండగా.. 2024 ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి 2025 మధ్య 371.6 బిలియన్ డాలర్లను విక్రయించినట్లుగా అంచనా. ఈ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గిస్థాయని, ప్రభుత్వ వ్యయం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని సైతం పెంచుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
వాస్తవానికి ఆర్బీఐ ప్రతి సంవత్సరం మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా చెల్లిస్తూ వస్తుంది. దేశ, విదేశీ సెక్యూరిటీలపై వడ్డీ, సేవలపై రుసుములు, కమీషన్స్, విదేశీ మారకపు ద్రవ్యం లావాదేవీలపై లాభం, అనుబంధ సంస్థల నుంచి ప్రతిఫలం రూపేణ ఆర్బీఐకు రాబడి వస్తుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, డిపాజిట్లు, రుణాలపై వడ్డీల చెల్లింపులు, సిబ్బంది జీతభత్యాలు, పింఛన్లు, కార్యాలయాల నిర్వహణ ఖర్చులు, ఆకస్మిక పరిస్థితులు, తరుగుదలకు కేటాయింపులు తదితర వ్యయాలు ఉంటాయి. ఈ ఆదాయ, వ్యయాల మధ్య తేడానే మిగులు నిధులుగా వ్యవహరిస్తుంటారు. ఈ మిగులు నిధులను కేంద్రానికి ఆర్బీఐ ప్రతి సంవత్సరం బదలాయిస్తుంది.