న్యూఢిల్లీ, నవంబర్ 26: అమెరికా లంచం కేసులో గౌతమ్ అదానీ ఇరుక్కోవడం.. అదానీ గ్రూప్‌నకు రకరకాల సమస్యల్ని తెచ్చిపెడుతున్నది. ఇప్పటికే ఆయా కంపెనీల షేర్ల విలువ దేశీయ స్టాక్ మార్కెట్లో పడిపోతుండగా, విదేశీ మదుపరులు పెట్టుబడులకు దూరం జరుగుతున్నారు. తాజాగా ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలైన మూడీస్, ఫిచ్ల సెగ కూడా అదానీకి తగిలింది. అదానీ గ్రూప్‌లోని ఏడు సంస్థల రేటింగ్ ఔట్‌లుక్‌ను ‘స్టేబుల్’ నుంచి ‘నెగెటివ్’లోకి దిగజార్చినట్టు మంగళవారం మూడీస్ ప్రకటించింది. వీటిలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్, రెండు అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ విభాగాలు, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్ వన్ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌పోర్టేషన్ రెస్ట్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్, అదానీ ఇంటర్నేషనల్ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలున్నాయి. మరోవైపు అదానీ ఎనర్జీ, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై బాండ్లను నెగెటివ్ మోడ్‌లో పెట్టినట్టు ఫిచ్ రేటింగ్స్ స్పష్టం చేసింది. దీంతో ఆయా సంస్థల్లోకి పెట్టుబడులు, బాండ్ల క్రయవిక్రయాలు రిస్క్‌లో పడ్డైట్టెంది.
టోటల్ఎనర్జీస్పై..
ఫ్రాన్స్‌కు చెందిన ఇంధన దిగ్గజం టోటల్ఎనర్జీస్.. అదానీ గ్రూప్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టబోమంటూ చేసిన ప్రకటనపై గ్రూప్ సంస్థ స్పందించింది. మా కార్యకలాపాలపై ఈ నిర్ణయం ఏ రకమైన ప్రభావం చూపబోదంటూ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేర్కొన్నది.
నష్టాల్లో స్టాక్స్
మంగళవారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌లో వివిధ అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువ గరిష్ఠంగా 7 శాతానికిపైగా పడిపోయింది. బీఎస్ఈలో అదానీ గ్రీన్ ఎనర్జీ 7.05 శాతం, అదానీ ఎంటర్ప్రైజెస్ 4.78 శాతం, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 3.79 శాతం, అదానీ టోటల్ గ్యాస్ 3.50 శాతం, అదానీ పోర్ట్స్ 3.23 శాతం, అదానీ విల్మర్ 2.44 శాతం, అంబుజా సిమెంట్స్ 2.30 శాతం, అదానీ పవర్ 2.04 శాతం, సంఘీ ఇండస్ట్రీస్ 1.91 శాతం, ఏసీసీ 1.37 శాతం, ఎన్డీటీవీ 0.09 శాతం మేరకు దిగజారాయి. ఇక బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 105.79 పాయింట్లు క్షీణించి 80,004.06 వద్ద, ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 27.41 పాయింట్లు కోల్పోయి 24,194.50 వద్ద నిలిచాయి.