ముంబై, నవంబర్ 6: ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో దేశ జీడీపీ వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్థిక వృద్ధిరేటు మందగమనంలోకి వెళ్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా జీడీపీ గణాంకాలు 7 శాతం దరిదాపుల్లోనే ఉంటాయన్న ఆందోళనను బుధవారం వారు వ్యక్తం చేశారు. తొలి త్రైమాసికం ఏప్రిల్-జూన్‌లోనూ జీడీపీ వృద్ధి 6.7 శాతంగానే ఉందని, ఇది 15 త్రైమాసికాల కనిష్ఠమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే గతంలో తమ అంచనాల్ని సవరిస్తూ ఈసారి జీడీపీ 7 శాతం దిగువనే ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆర్థిక కార్యకలాపాల ప్రగతిని చూపే 50 సంకేతాల సూచీ ప్రతికూలంగా కనిపిస్తున్నదని, నిరుడు జూలై-సెప్టెంబర్‌లో 80 శాతంగా ఉంటే, ఈసారి 69 శాతంగానే ఉందని, ఏప్రిల్-జూన్‌లోనూ 78 శాతంగా ఉన్నట్టు ఎస్బీఐ ఎకనామిస్టులు చెప్తున్నారు. వినియోగం, డిమాండ్‌లో తగ్గుదల కనిపిస్తున్నదని.. వ్యవసాయ, పరిశ్రమ, సేవా రంగాల్లోనూ ఆశాజనక పరిస్థితుల్లేవని అంటుండటం గమనార్హం.