హైదరాబాద్, సెప్టెంబర్ 18: ప్రముఖ ద్విచక్ర ఈవీల తయారీ సంస్థ ప్యూర్ ఈవీ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఐపీవోకి రావడానికి ప్రణాళికను వేగవంతం చేసినట్లు ప్యూర్ ఈవీ సీఈవో రోహిత్ వదేరా తెలిపారు.
దేశీయంగా ద్విచక్ర వాహనాలను వాడేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నారని, వీరిని దృష్టిలో పెట్టుకొని సాంకేతిక పరంగా మార్పులు చేసి నయా ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. వచ్చే ఐదేండ్లలో దేశీయ ద్విచక్ర వాహనాల విక్రయాల్లో 65 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా పెట్టుకున్నట్లు, ఇందుకోసం రిటైల్ అవుట్లెట్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు ప్లాంట్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్నట్లు చెప్పారు.
దీంతో కంపెనీ టర్నోవర్ రూ.2 వేల కోట్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈవీ రంగంలోకి అడుపెట్టి మూడేండ్లలోనే నిర్వహణ లాభాలు ఆర్జించిన సంస్థ తమదేనన్నారు. వచ్చే ఐదేండ్లలో 100 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఐఐటీ హైదరాబాద్‌తో ఇప్పటికే భాగస్వామ్యం కలిగివున్న సంస్థ..బ్రిటన్‌కు చెందిన కోవెంట్రీ ఇంజినీరింగ్ సంస్థతో జట్టుకట్టబోతున్నది.