న్యూఢిల్లీ, జూలై 26: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.1,255 కోట్ల స్టాండ్‌లోన్ నికర లాభాన్ని గడించింది. మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం, వడ్డీల మీద వచ్చే ఆదాయం పెరగడంతో ఏడాది క్రితం వచ్చిన రూ.308 కోట్ల లాభంతో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,294 కోట్ల నుంచి రూ.28,579 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో బ్యాంక్‌కు వడ్డీల మీద రూ.25,145 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 11.2 శాతం నుంచి 7.73 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ 4.26 శాతం నుంచి 1.98 శాతానికి దిగొచ్చాయి. మరోవైపు, మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,374 కోట్ల నిధులను వెచ్చించింది.