న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: మరో రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు వడ్డీరేట్లను తగ్గించాయి. వీటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉన్నాయి. దీంట్లో పీఎన్బీ..ఎంసీఎల్ఆర్ని 15 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టు ప్రకటించింది. తగ్గించిన రేట్లు ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చాయని పేర్కొంది. అలాగే బీవోఐ కూడా తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్ల నుంచి 15 బేసిస్ పాయింట్ల వరకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నది.
బ్యాంకులు తీసుకున్న తాజా నిర్ణయంతో రుణగ్రహీతల నెలవారి ఈఎంఐ చెల్లింపులు తగ్గనున్నాయి. గత పరపతి సమీక్షలో రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి.
ఇదే క్రమంలో పీఎన్బీ తన ఎంసీఎల్ఆర్ని 8 శాతం నుంచి 9.10 శాతానికి దించింది. అంతకుముందు 8.15 శాతం నుంచి 9.15 శాతంగా ఉన్నది. అలాగే బీవోఐ కూడా తన ఎంసీఎల్ఆర్ని 7.95 శాతం నుంచి 9.00 శాతం మధ్యలో తగ్గించింది.