న్యూఢిల్లీ, ఆగస్టు 12 : వేల కోట్ల రూపాయల్లో ఎడాపెడా అప్పులిచ్చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఆపై వాటిని వసూలు చేసుకోలేక వదిలించుకుంటున్నాయి. ఇలా గత 5 ఆర్థిక సంవత్సరాల్లో దాదాపు రూ.6 లక్షల కోట్ల మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)లను దేశంలోని సర్కారీ బ్యాంకులు రైటాఫ్ చేశాయి. మంగళవారం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది మరి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంగా చెప్పిన వివరాల ప్రకారం.. 2020-21 నుంచి 2024-25 వరకు మొత్తం రూ.5.82 లక్షల కోట్లకుపైగా ఎన్పీఏలను ప్రభుత్వ బ్యాంకులు రైటాఫ్ చేశాయి. అత్యధికంగా 2020-21లో రూ.1.33 లక్షల కోట్ల రుణాలను ఖాతా పుస్తకాల నుంచి బ్యాంకర్లు తొలగించేశారు.
రుణాల రైటాఫ్‌లో దేశంలోని మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టాప్‌లో ఉన్నది. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఈ బ్యాంక్ ఒక లక్షా 10 వేల కోట్ల రూపాయలకుపైగానే రుణాలను వదిలించుకున్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి మరి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ), కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సైతం పెద్ద ఎత్తున రైటాఫ్‌లకు దిగినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన గణాంకాల్లో కనిపిస్తున్నది.
కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి చూస్తే.. దేశీయ బ్యాంకింగ్ రంగంలో రుణాల రైటాఫ్‌లు రూ.17 లక్షల కోట్లపైనే ఉండటం గమనార్హం. ఇందులో దాదాపు రూ.14 లక్షల కోట్లదాకా రైటాఫ్‌లు ప్రభుత్వ రంగ బ్యాంకులవే ఉంటాయని అంచనా. ఇక రైటాఫ్ అయిన ఈ మొత్తం లోన్లలో రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలు కార్పొరేట్ కంపెనీలకే చెందినవని తెలుస్తున్నది. సామాన్యులు రుణం కోసం వెళ్తే లక్ష ప్రశ్నలు వేసే బ్యాంకర్లు.. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ వేసిమరీ వేల కోట్ల రూపాయల అప్పుల్ని ఇచ్చేస్తున్నారు. చివరకు వారు ఎగ్గొడితే రైటాఫ్‌లతో ఖాతా పుస్తకాలను క్లీన్ చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదిలావుంటే 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హయాంలో బ్యాంకుల లోన్ రైటాఫ్‌లు రూ.2.20 లక్షల కోట్లుగానే ఉన్నాయి. కానీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కారు హయాంలో ఎనిమిదింతలకుపైగా రైటాఫ్‌లు ఎగబాకిపోయాయి.