హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 19: సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్నిరంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని మండలి చీఫ్‌విప్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. హైదరాబాద్‌లో టీ న్యూస్ ఏర్పాటుచేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…గత పదేండ్లలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందడంతో అందరి చూపు నగరంపై పడిందని, దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయన్నారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఐటీ రంగంలో పెద్ద ఎత్తున సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేయడంతో వివిధ రాష్ర్టాలకు చెందిన ప్రజలు ఇక్కడ స్థిరపడటానికి ఆసక్తి చూపుతున్నారని చెప్పారు. నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉండటంతోపాటు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నదని, హరితహారంతో ఆకు పచ్చని నగరంగా మారిందన్నారు.
ఆదివారం కూడా…
శనివారం ప్రారంభమైన టీ న్యూస్ ప్రాపర్టీ షో ఆదివారం కూడా కొనసాగనున్నది. రెండు రోజులపాటు కొనసాగే ఈ షోలో 60కి పైగా ప్రముఖ నిర్మాణ సంస్థలు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ధనవంతుల నుంచి మధ్యతరగతి వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా పెద్ద ప్రాజెక్టుల నుంచి చిన్న వెంచర్లు కూడా తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. ఈ కార్యక్రమానికి ప్రణవ్ కన్స్ట్రక్షన్ ఎండీ రాంబాబు, టీ న్యూస్ సీఈవో నారాయణ రెడ్డి, సీజీఎం ఉపేందర్, టీ న్యూస్ డీజీఎం కిరణ్, మార్కెటింగ్ టీం సత్యపాల్ శ్రీనివాస్, ఉదయ్‌భాస్కర్, వెంకటరెడ్డి, సతీశ్‌లు పాల్గొన్నారు.
రుణమిచ్చేందుకు బ్యాంకర్లు సైతం..
కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి బ్యాంక్‌లు సైతం నడుంబిగించాయి. ఈ ప్రాపర్టీ షోలో బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ)లు ప్రత్యేక స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి. ఈ స్టాళ్లలో గృహ రుణాలకు సంబంధించి సమగ్ర సమాచారంతోపాటు వడ్డీరేట్లు, ఇతర వివరాలపై అవగాహన కల్పించారు.
పేద, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల వారి కోసం ప్రాజెక్టులను నిర్వహిస్తున్నాం. మహేశ్వరం- శ్రీశైలం జాతీయ రహదారిలో పొలం, హిల్ సైడ్, జడ్చర్ల-బెంగళూరు హైవేలో గ్రీన్ సిటీ, వనమ్, మెర్కూరీ టౌన్షిప్ పేర్లతో సామాన్యుడి బడ్జెట్లో కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రాజెక్టులు రూపొందించాం. శంషాబాద్ వరకు మెట్రోను పొడిగిస్తుండటంతో భవిష్యత్తులో నగరం ఇంకా విస్తరించే అవకాశం ఉన్నది. కాబట్టి తక్కువ ధరలు ఉన్నప్పుడే భూమిపై పెట్టుబడి పెడితే అది రెట్టింపు అవుతుంది.
– పాండురంగ, లవోరా డెవలపర్స్ డైరెక్టర్
మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే తినే తిండి కలుషితం కాకూడదు. అందుకే ‘మన పంట’ పేరుతో సేంద్రీయ వ్యవసాయం చేసుకునే వీలుగా ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్టును రూపొందించాం. భూమిపై తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు ఏవిధంగా వస్తాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తులతో ఆరోగ్యాలను కాపాడుకోవడంతోపాటు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్, ట్రిపుల్ అయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించి కస్టమర్లకు చేరువ అవుతున్నాం. – కిరణ్, సంపంగి గ్రూప్ డైరెక్టర్
పేదోడి నుంచి సంపన్నుడి వరకు తమకు తగిన స్థాయిలో సొంతిల్లు నిర్మించుకోవాలన్నది ప్రతి ఒక్కరి కల. అందుకే ఇల్లు కట్టి చూడు.. పెండ్లి చేసి చూడు అంటారు పెద్దలు. ఇల్లు కట్టాలన్నా.. స్థలం కొనుగోలు చేయాలన్నా.. స్థిర చరాస్తులు కూడబెట్టాలన్నా.. సరైన అవగాహన అవసరం. ఇందుకు అన్నివర్గాలకు తగినట్టుగా కొండాపూర్, హైటెక్‌సిటీ, ఖానామెట్,సోమాజీగూడల్లో బిజినెస్ టవర్స్ నిర్మించాం. శామీర్‌పేట, రాయగిరి (భువనగిరి)ల్లో ఓపెన్ ప్లాట్స్, అత్తాపూర్, హస్తినపురంలో అపార్ట్మెంట్లు నిర్మించాం.
– దీపక్ జోషి, ప్రణవ్ గ్రూప్ డీజీఎం