న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: సోలార్ సెల్ ఉత్పత్తుల తయారీ సంస్థ ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కావడానికి సిద్ధమవుతున్నది. ఇందు కు సంబంధించి సెబీకి దరఖాస్తు చేసుకున్నది కూడా. వ్యాపార విస్తరణకోసం అవసరమయ్యే నిధుల్లో రూ. 1,500 కోట్ల నిధులను ఈ ఐపీవో ద్వారా సమీకరించాలని యోచిస్తున్నది. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 2.82 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించబోతున్నారు.
వీటిలో సౌత్ ఆషియా గ్రోథ్ ఫండ్ 2 హోల్డింగ్స్ ఎల్ఎల్సీ 2.38 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తుండగా, సౌత్ ఆసియా ఈబీటీ ట్రస్ట్‌కు చెందిన 1.53 లక్షల ఈక్విటీ షేర్లు, ప్రమోటర్ చిరంజీవి సింగ్ 42 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయించనున్నారు. 1995లో ప్రారంభమైన ప్రీమియం ఎనర్జీస్..సోలార్ సెల్ అండ్ మాడ్యుల్‌ను తయారు చేస్తున్నది. ప్రస్తుతం సంస్థ 2 గిగావాట్ల కెపాసిటీతో సెల్స్‌ను ఉత్పత్తి చేస్తుండగా, 3.36 గిగావాట్ల సామర్థ్యంతో మాడ్యుల్స్‌ను ప్రొడ్యుస్ చేస్తున్నది. అలాగే హైదరాబాద్‌తోపాటు సంస్థకు ఐదు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ ఐపీవో ద్వారా సేకరించిన నిధులను భవిష్యత్తు వ్యాపార విస్తరణకోసం వినియోగించనున్నట్లు తెలిపింది. 2022 -23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 1,428 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం కంపెనీ చేతిలో రూ.5,300 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.