హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు అన్నారు. రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమల పెద్ద ఉపాధి కల్పన రంగంగా విస్తరిస్తున్నదని, ఈ రంగ అభివృద్ధికి ప్రభుత్వం మరింత చేయూత అందించడానికి సిద్ధంగా ఉందని దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా-2025 ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో ఇరువురు మంత్రులు అన్నారు. పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ద్వారా భారీ స్థాయి లో ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వారు అభిప్రాయపడ్డారు.
భవిష్యత్లో పౌల్ట్రీ పరిశ్రమకు మంచి ఆదరణ లభిస్తుందని గుడ్లు, చికెన్ ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్సింగ్ బయాస్ మాట్లాడుతూ…వికసిత్ భారత్ దిశగా, స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు దారితీస్తూ 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోనువన్ నేషన్ వన్ ఎక్స్పో అనే థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఎగ్జిబిషన్లో 1,500కి పైగా ప్రతినిధులు, 7కు పైగా అంతర్జాతీయ నిపుణులు హాజరైనట్లు చెప్పారు. ప్రస్తుతం భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో రెండొ స్థానం, బ్రాయిలర్ చికెన్ ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందని ఉదయ్సింగ్ బయాస్ అన్నారు.