న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20 : పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) వడ్డీరేట్లను పావుశాతం మేర తగ్గించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో గృహ, వాహన, విద్యా, వ్యక్తిగత రుణాలపై ఈఎంఐలు మరింత తగ్గనున్నాయి. రిజర్వు బ్యాంక్ రెపో రేటును పావు శాతం తగ్గించిన నేపథ్యంలో ప్రధాన బ్యాంకులు వరుసగా వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఇప్పటికే ఎస్బీఐ వడ్డీరేట్లను పావు శాతం కోత విధించిన విషయం తెలిసిందే. దీంట్లోభాగంగా పీఎన్బీ..గృహ రుణాలపై వడ్డీరేటును 8.15 శాతానికి దించింది. దీంతోపాటు రుణగ్రహీతలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజుతోపాటు డాక్యుమెంటేషన్ చార్జీలను సైతం పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. ఈ అవకాశం మార్చి 31 లోపు తీసుకునే రుణాలకు వర్తించనున్నదని తెలిపింది. అలాగే సాంప్రదాయక గృహ రుణాల స్కీం కింద 8.15 శాతం వడ్డీకే రుణాలు అందిస్తున్నది.
ఈ స్కీం కింద లక్ష రూపాయల రుణానికి ఈఎంఐ రూ.744గా నిర్ణయించింది. దీంతోపాటు నూతన, సెకండ్ హ్యాండ్ కార్లపై 8.50 శాతం వడ్డీకి రుణాలు అందిస్తున్నది. లక్ష రూపాయల రుణంపై రూ.1,240 ఈఎంఐ చెల్లించాల్సివుంటుంది. వాహన కొనుగోళ్లు పెంచాలనే ఉద్దేశంతో ఈ రుణాలపై 0.05 శాతం రాయితీ కల్పించింది. 120 నెలల్లో తిరిగి చెల్లింపులు జరిగే విధంగా ఎక్స్-షోరూం ధరపై 100 శాతం రుణాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే 7.85 శాతానికి విద్యా రుణాలు ఇవ్వనున్నది. డిజిటల్ ప్రాసెసింగ్‌తో కస్టమర్ రూ.20 లక్షల వరకు రుణాన్ని తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది బ్యాంక్. రుణం కోసం బ్యాంక్ శాఖకు లేదా పేపర్‌వర్క్ లేకుండా పూర్తిచేయనున్నది. దీనిపై వడ్డీరేటును 11.25 శాతానికి దించింది. తగ్గించిన వడ్డీరేట్లు ఈ నెల 10 నుంచే అమలులోకి వచ్చాయని పేర్కొంది.