న్యూఢిల్లీ, జూలై 1: పెట్రో ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం ఎగుమతి పన్నును పరిచయం చేసింది. లీటర్ పెట్రోల్‌పై రూ.6, డీజిల్‌పై రూ.13 చొప్పున విధిస్తున్నట్టు శుక్రవారం ప్రకటించింది. లీటర్ విమానయాన ఇంధనం (ఏటీఎఫ్)పైనా రూ.6 ఎగుమతి పన్నును వేసింది. వెంటనే ఈ పన్నులు అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలో ఉత్పత్తయ్యే ముడి చమురుపైనా బ్రిటన్ తరహాలో విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మోదీ సర్కారు తెచ్చింది.
టన్నుకు రూ.23,250గా ఈ పన్ను ఉన్నది. నిరుడు దాదాపు 29 మిలియన్ టన్నుల క్రూడాయిల్ భారత్‌లో ఉత్పత్తి అయ్యింది. దీన్నిబట్టి తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.66,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్‌లపై వేసిన ఎగుమతి పన్నులనూ కలిపితే లక్ష కోట్ల రూపాయల వార్షిక ఆదాయం ఉంటుందని చెప్తున్నారు. కొన్ని రిఫైనరీలు దేశీయ సరఫరా ధరలకే విదేశాలకు పెట్రోల్, డీజిల్‌ను ఎగుమతి చేస్తూ భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయని ప్రభుత్వం అంటున్నది. ఈ క్రమంలోనే ఎగుమతి సుంకాలను తీసుకొచ్చింది. అయితే దేశంలో ఇంధన లభ్యతను పెంచడానికే ఈ నిర్ణయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటున్నారు. 15 రోజులకోసారి ఈ ట్యాక్స్‌లను సమీక్షించి సవరిస్తామనీ చెప్తున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. రిలయన్స్ ఇండస్ట్రీస్, రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయరా ఎనర్జీ వంటి దేశ, విదేశీ ప్రైవేట్ సంస్థలతోపాటు, ఓఎన్జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థలనూ ప్రభావితం చేస్తున్నది. శుక్రవారం ట్రేడింగ్‌లో రిలయన్స్ షేర్ విలువ 7.14 శాతం పడిపోయింది. దీంతో రూ.1.25 లక్షల కోట్ల మార్కెట్ విలువ కరిగిపోయింది. ఓఎన్జీసీ షేర్ విలువ కూడా 13.4 శాతం దిగజారింది. మిగతా చమురు రంగ షేర్లూ నష్టపోయాయి. మొత్తంగా బీఎస్ఈ ఎనర్జీ ఇండెక్స్ 3.99 శాతం పతనమైంది.