Plane Crash | అహ్మదాబాద్ గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఇందులో ఇద్దరు పైలట్లు, పది మంది క్రూ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులున్నారు. ఇప్పటి వరకు 186 మంది వరకు మృతదేహాలను వెలికి తీశారు. అయితే, ప్రమాదంలో గాయపడ్డ చనిపోయిన వారికి.. గాయపడ్డ వారికి పరిహారం ఎవరు చెల్లిస్తారు? ఎంత చెల్లిస్తారో తెలుసుకుందాం..!
విమాన ప్రమాదంలో గాయపడితే.. మరణిస్తే ఎయిర్‌లైన్స్ చట్టపరంగా పరిహారం చెల్లించడం తప్పనిసరి. మాంట్రియాల్ కన్వెన్షన్ 1999 ప్రకారం (భారత్ అనుసరిస్తున్న అంతర్జాతీయ ఒప్పందం) కింద ఒక్కో ప్రయాణికుడికి దాదాపు రూ.1.4 కోట్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విమానయాన సంస్థ నిర్లక్ష్యం అని తేలితే అదనంగా పరిహారం చెల్లిస్తారు. అంతర్జాతీయ ప్రయాణాలపై మాత్రమే వర్తిస్తుంది. అయితే, దేశీయ విమానయాన సంస్థలు సైతం డీజీసీఏ మార్గదర్శకాల మేరకు పరిహారం చెల్లిస్తుంటాయి. అయితే, ప్రయాణ సమయంలో ట్రావెల్ ఇన్సురెన్స్ తీసుకున్న వారికి అదనపు భరోసా ఉంటుంది.
ప్రయాణ సమయంలో ట్రావెల్ ఇన్సురెన్స్ తీసుకున్న వారికి అదనంగా పలు లాభాలుంటాయి. ప్రయాణికుడు మరణిస్తే రూ.25లక్షల నుంచి రూ.కోటి వరకు పరిహారం వస్తుంది. శాశ్వత వైకల్యం పొందితే రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు అందుతుంది. బ్యాగేజీ మిస్సింగ్, ఫ్లయిట్ ఆలస్యం, విమానం రద్దు తదితర సమస్యలు వచ్చిన సమయంలోనూ పరిహారం చెల్లిస్తారు. ట్రావెల్ ఇన్సురెన్స్ ప్లాన్ తీసుకున్న వారికి మాత్రమే నిబంధనలు వర్తిస్తాయి. అయితే, దేశీయంగా ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఈ ప్లాన్‌ని తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. అయితే, ట్రావెల్ ఇన్సురెన్స్ లేకపోయినా పరిహారం అందుతుంది.
ఎయిర్‌లైన్స్ నుంచి చట్టపరంగా ఇచ్చే పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందించే విషయం తెలిసిందే. చాలా విమాన ప్రమాదాల సమయంలో ప్రభుత్వం దాదాపుగా పరిహారం ప్రకటించదు. కానీ, పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగిన సందర్భంల్లో అరుదుగా పరిహారం ఇస్తుంది. అయితే, ఉద్యోగ విషయంలో ప్రయాణమైతే కంపెనీ ఇన్సురెన్స్ వర్తిస్తుంది. కొన్ని రకాల క్రెడిట్ కార్డుల ద్వారా ట్రావెల్ బీమా సౌకర్యం వర్తిస్తుంది. టూర్ కంపెనీలు, ఆఫీస్ గ్రూప్ ట్రిప్స్ సమయంలోనే గ్రూప్ బీమా ఉంటుంది. అయితే, విమాన ప్రమాదాల తర్వాత పలుసార్లు పరిహారం వెంటనే ఇవ్వరు. ప్రమాదంపై సరైన దర్యాప్తు వేగంగా జరుగకపోవడం, బాధ్యత ఎవరిదో స్పష్టంగా తేలకపోవడం, ప్రయాణికుడికి బీమా లేకపోవడం.. నామినీ వివరాలు నమోదు చేయకపోవడం వంటి కారణాలతోనూ ఆలస్యం జరిగేందుకు అవకాశం ఉంటుంది.
విమాన ప్రయాణికులు తమ ప్రయాణం సమయంలో తప్పనిసరిగా ట్రావెల్ ఇన్సురెన్స్ తీసుకోవడం ముఖ్యం. పాలసీలో నామినీ వివరాలు నమోదు చేయించాలి. ప్రింటెడ్, డిజిటల్ బీమా కాపీలు భద్రపరుచుకోవాలి. బీమా ప్లాన్ ఎంపిక చేసుకునే సమయంలో మరణంతో పాటు వైద్య ఖర్చులు వచ్చేలా ఉన్న ప్లాన్స్ మాత్రమే తీసుకోవడం ఉత్తమం.