30 ఏండ్ల వయసు.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మలుపు. ముగిసిన చదువు, ఉద్యోగంలో స్థిరత్వం, వైవాహిక జీవితం ప్రారంభం.. ఇలా అనేక సంఘటనలు ఈ వయసులోనే జరుగుతాయి. అయితే ఆ తర్వాత ఆర్థికంగా ఎంత భద్రంగా ఉంటామన్న దానిపైనే జీవితంలో స్థిరపడటం ఆధారపడి ఉంటుంది. కాబట్టి 30వ ఏటలోకి రాకముందే ఆర్థిక ప్రణాళిక సవ్యంగా ఉంటే ఆ తర్వాతి
జీవితం నల్లేరుపై నడకే. జీవితంలో స్థిరపడటానికి ఉపయోగపడే ఆర్థిక ప్రణాళికలో ఉండాల్సిన విషయాలేమిటో చూద్దాం.
రుణాల చెల్లింపులు
పెద్ద చదువుల కోసం తీసుకున్న విద్యా రుణాన్ని మొదటగా తీర్చేసి జీవితం ఆరంభంలోనే అప్పుల బాధ నుంచి బయటపడండి. 30 ఏండ్లు వచ్చేసరికి ఎలాంటి అప్పు భారం లేకుండా ఉంటేనే ఆ
తర్వాతి ప్రణాళిక రచన సులువు. సొంతిల్లు, వాహనం లాంటి ఇతర అధిక విలువగల కొనుగోళ్లకు మార్గం సుగమమవుతుంది.
బీమా
ఎంత తక్కువ వయసులో బీమా తీసుకుంటే అంత తక్కువ ప్రీమియం ఉంటుంది. వయసు పెరిగేకొద్ది ఎలాంటి బీమా అయినా సరే ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సిందే. తక్కువ వయసు
ఉన్నప్పుడే మీ వార్షిక ఆదాయానికి కనీసం 10 నుంచి 20 రెట్ల బీమా కవరేజికి టర్మ్ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి. ఆరోగ్య బీమానూ తీసుకోవాల్సిందే. పెరుగుతున్న వ్యయాల నేపథ్యంలో ఫ్యామిలీ
ఫ్లోటర్ ప్లాన్‌ను తీసుకోండి.
మదుపు
ముప్పై ఏండ్లకు వచ్చామంటేనే కొంతకాలం నుంచి ఉద్యోగం చేస్తూనే ఉంటారు. వచ్చే ఆదాయంలో కనీసం 10 శాతం మొత్తాన్ని దీర్ఘకాల మదుపు చేయండి. పొదుపు చేయడం వల్ల, అన్ని పొదుపు సాధనాలు ఆకర్షణీయ రాబడులు ఉండవు. అందుకని కొంత భాగాన్ని దీర్ఘకాలంలో అధిక రాబడిని ఇవ్వగల సాధానాల్లో మదుపు చేయండి. తద్వారా సొంతిల్లు కలను కనీసం 40 ఏండ్ల తర్వాతైనా సాకారం చేసుకోవచ్చు. అలాగే పొదుపు చేసే మొత్తంలో కొంత భాగం కచ్చితంగా అత్యవసర సమయాల్లో ఉపయోగపడేలా ఎమర్జెన్సీ ఫండ్ కోసం కేటాయించండి.
రిటైర్మెంట్
పదవీ విరమణ తర్వాతి కాలం కోసం కూడా పొదుపు మొదలు పెట్టాల్సిన వయసు ఇదే. ఈ వయసులో రిటైర్మెంట్ ప్రణాళికను మొదలు పెట్టడం వల్ల ప్రయోజనాలు అనేకం. చిన్నచిన్న మొత్తాల పొదుపే, రిటైర్మెంట్ సమయానికి ఊహించనంతగా పెరిగిపోయి హాయిగా కాలం గడిపేయవచ్చు. దీనికితోడు మన నైపుణ్యాలను పెంచుకునేందుకు కెరీర్లో ఉన్నత స్థానాలను చేరుకునేందుకు శిక్షణ తీసుకోవడం, కొత్త కోర్సులు నేర్చుకోవడం కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందనే పరిగణించాలి.
ఖర్చుల నియంత్రణ
బాధ్యతలు పెరిగే వయసులో ఖర్చులూ అధికంగానే ఉంటాయి. అయితే ఇవి మన క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయకుండా చూసుకోవడం మరో ముఖ్య విషయం. విలాసాల కోసం కొనుగోళ్లు, విచ్చలవిడిగా క్రెడిట్ కార్డుల వినియోగం తగదు. ఈఎంఐల ఊబిలో కూరుకుంటే క్రెడిట్ స్కోర్ బాగా తగ్గిపోతుంది. భవిష్యత్తులో ఇల్లు, కారు లాంటి కొనుగోళ్లకు అప్పు దొరకడం కష్టమవుతుంది. అందుకే క్రెడిట్ స్కోర్ కాపాడుకుంటూ ఉండండి.
పన్ను ప్రణాళిక
పన్నుల ఆదా కోసం వివిధ పొదుపు, మదుపు సాధనాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ప్రణాళికలో ఇదో ముఖ్యమైన అంశం. పన్ను ప్రణాళికలో భాగంగా చేసే మదుపు లేదా పొదుపు కూడా మీ లక్ష్యాల సాధనకు ఉపయోగపడుతుందన్న విషయాన్ని మరువద్దు. అలాగే మదుపు చేయడంలో డైవర్సిఫికేషన్‌ను ప్రయత్నించండి. అందువల్ల మార్కెట్ పరిస్థితులు ఎలా ఉన్నా మనకు వచ్చే రాబడిపై ప్రభావం ఉండదు.