మరో మూడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయా?..
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీలను మూసేయాలని మోదీ సర్కారు యోచిస్తున్నదా?..
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఏమంటున్నారు?..
దుబాయ్, మార్చి 30: ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్నట్టుంది?.. అని అడిగిన ప్రశ్నకుగానూ పైవిధంగా మంత్రి బదులిచ్చారు. ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీలు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ ఇండియన్ జ్యుయెల్లరీ ఎక్స్పోజిషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి పీటీఐతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీలపై స్పందిస్తూ జాతీయ ప్రయోజనాలు, దేశ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. తమ ముందున్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఎయిర్ ఇండియాను అమ్మేసిన కేంద్ర ప్రభుత్వం.. బ్యాంకులను విలీనం చేస్తూ, వాటాలను అమ్ముకుంటున్న సంగతి విదితమే. ఎల్ఐసీలోనూ వాటాల ఉపసంహరణకు దిగుతున్నది. ఇప్పుడు ఎంఎంటీసీ తదితర సంస్థలనూ మూసివేయాలని యోచిస్తున్నది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం గురించి గోయల్ మాట్లాడుతూ.. కొన్ని ఆహారోత్పత్తుల ధరలు పెరిగే వీలుందన్నారు. ఇదే జరిగితే ఆయా దేశాలకు సదరు ఉత్పత్తులను భారత్ సరఫరా చేయగలదని చెప్పారు. ఈజిప్టుతో గోధుమల ఎగుమతికి సంబంధించి తుది చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. చైనా, టర్కీ, ఇరాన్లతోనూ సంప్రదింపులు జరుగుతున్నట్టు వివరించారు. ప్రపంచ గోధుమ ఉత్పత్తిలో రష్యా-ఉక్రెయిన్ దేశాలు ప్రధానంగా ఉన్న విషయం తెలిసిందే.
మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ)ను 1963లో నెలకొల్పారు. ఎస్టీసీ నుంచి విడదీశారు. ఖనిజాల ఎగుమతి, నాన్-ఫెర్రస్ లోహాల దిగుమతులను నిర్వహిస్తున్నది. 2019లో సంస్థ ఆదాయం రూ.28,997 కోట్లు. ఆస్తులు రూ.4,454.77 కోట్లు. ఈక్విటీ రూ.1,489.25 కోట్లుగా ఉన్నది. సుమారు 800 మంది ఉద్యోగులున్నారు.
స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎస్టీసీ)ను 1956లో ప్రారంభించారు. ఇది భారత ప్రభుత్వ అంతర్జాతీయ ట్రేడింగ్ సంస్థ. ముఖ్యంగా ఎగుమతి, దిగుమతి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. తూర్పు ఐరోపా దేశాలతో వాణిజ్యంలో ఎస్టీసీ ప్రధాన భూమిక పోషిస్తున్నది.
ప్రాజెక్ట్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్ (పీఈసీ)ను ఎస్టీసీ అనుబంధ సంస్థగా 1971లో స్థాపించారు. రైల్వే, ఇంజినీరింగ్ ఎక్విప్మెంట్ ఎగుమతుల కెనలైజ్డ్ వ్యాపారం నిర్వహణకు దీన్ని తెచ్చారు. 1997లో ఇది స్వతంత్ర సంస్థగా ఆవిర్భవించింది.