న్యూఢిల్లీ, నవంబర్ 17: దేశీయ ఔషధ రంగ పరిశ్రమకు 2030 నాటికి 4-5 రెట్లు వృద్ధి చెంది దాదాపు 200 బిలియన్ డాలర్లకు చేరే సామర్థ్యం ఉందని ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శి అరునిష్ చావ్లా అన్నారు. శుక్రవారం ఇక్కడ జరిగిన వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ ఫార్మా ఇండస్ట్రీ పెంచుకుంటున్న ఉత్పాదకత, ఎగుమతుల విలువ మరో ఏడేండ్లలో రూ.16.65 లక్షల కోట్ల (200 బిలియన్ డాలర్లు)కు చేరవచ్చన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇది దాదాపు 50 బిలియన్ డాలర్లుగానే ఉందన్న ఆయన.. ఏడేండ్లలో మరో 150 బిలియన్ డాలర్లు పెరుగవచ్చని అంచనా వేశారు.
భారతీయ ఫార్మా ఇండస్ట్రీకి రెండంకెల వృద్ధి అవసరమని ఈ సందర్భంగా చావ్లా అన్నారు. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దిగుమతుల్ని తగ్గించుకుంటూ.. ఆయా దేశాలకు ఎగుమతుల్ని పెంచుకుంటూపోతే ఏటేటా ఆకర్షణీయ వృద్ధిని అందుకోవచ్చని పరిశ్రమకు సూచించారు. కాగా, ప్రస్తుతం ప్రపంచ ఔషధ రంగంలో భారతీయ సంస్థలకు, వాటి పరిశోధనలకు ప్రధాన గుర్తింపే ఉన్నది. కరోనా వేళ వ్యాక్సిన్ల తయారీలో దేశీయ సంస్థల పాత్రేమిటో విదితమే. ముఖ్యంగా హైదరాబాదీ సంస్థల కృషి అనిర్వచనీయం. ఇక దేశీయ ఫార్మా ఇండస్ట్రీ హబ్‌గా రాష్ట్ర రాజధాని నగరం విరాజిల్లుతున్నది తెలిసిందే.
వచ్చే 20-30 ఏండ్లలో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకోనున్నాయని ఈ సందర్భంగా చావ్లా పేర్కొన్నారు. స్మార్ట్ థెరపీలకు విశేష ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. కాగా, ప్రస్తుత విధానాలను పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడే దిగుమతిదారుల నుంచి ఎగుమతిదారులుగా భారతీయ కంపెనీలు ఎదుగుతాయన్న విశ్వాసాన్ని కనబర్చారు. ప్రభుత్వాలు, కంపెనీల యాజమాన్యాలు కలిసి ముందుకెళ్తే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా చేరుకోవచ్చన్నారు.