economic recession | కొత్త కారు కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి! రిఫ్రిజిరేటర్ మార్చాలని ఆలోచిస్తున్నారా? ఆగండి ఆగండి!! ఫిఫా వరల్డ్‌కప్ చూడటానికి పెద్ద టీవీ తెద్దామని ఫిక్సయ్యారా? తొందరొద్దు!! ఆర్థిక మాంద్యం ముంచుకొస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాలని ఇటీవల అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సూచించారు. డబ్బు పదిలంగా దాచుకోవాలని, ఉన్నదాంట్లో సర్దుకుపోవాలని హెచ్చరించారు కూడా! అయితే, అమెరికా, యూరప్ దేశాల్లో ముసురుకుంటున్న మాంద్యం కారుచీకట్లు మనదేశానికి విస్తరించే ప్రమాదమైతే ఇప్పట్లో లేదు! కాకపోతే, కీడెంచి మేలెంచడం మంచి లక్షణం. ఒకవేళ ఆర్థిక మాంద్యం ఏర్పడినా.. బతుకు భారం కాకుండా జాగ్రత్తలు తప్పనిసరి.
ఆర్థిక మాంద్యానికి నిపుణులు రకరకాల నిర్వచనాలు ఇస్తుంటారు. అయితే, ఉన్న ఉద్యోగాలు కోల్పోవడం, కొత్త కొలువులు లభించకపోవడం మాంద్యం వల్ల తలెత్తే ప్రధాన సమస్య. ఇలాంటి పరిస్థితులు ప్రపంచానికి కొత్తేం కాదు. 1929లో అమెరికా మాంద్యంలో కూరుకుపోయింది. 2000 సంవత్సరంలో, 2008లోనూ ప్రపంచ ఆర్థిక రంగం దీని బారినపడింది. అయితే, మాంద్యం ప్రభావం ఏడాది నుంచి ఏడాదిన్నర వరకే కొనసాగుతుందని గత అనుభవాలు చెబుతున్నాయి. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత మళ్లీ కొలువులో కుదురుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ, మాంద్యం పడగలో ఏడాది గడపడానికి కావాల్సిన ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అత్యవసరం.
మిగతా రంగాలతో పోలిస్తే మాంద్యం ప్రభావం అత్యధికంగా ఉండేది ఐటీ సెక్టార్‌పైనే! గడిచిన రెండేండ్లలో ఐటీ ఉద్యోగుల వేతనాలు అంచనాలకు మించి పెరిగాయి. పైగా ఈ రంగంలో రికార్డు స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. మూన్లైట్ పేరుతో జంట ఉద్యోగాలు చేస్తున్న వాళ్లూ ఉన్నారు. అన్నిటినీ మించి ఆర్థికంగా క్రమశిక్షణ పాటించేవారికి ఉన్నపళంగా ఉద్యోగం ఊడినా మిన్ను విరిగి మీద పడేదేం ఉండదు. ఏదో జరిగిపోయిందని హైరానా పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. పొదుపు చేసుకున్న డబ్బులను పదిలంగా వాడుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. మాంద్యం ప్రభావం గరిష్ఠంగా 18 నెలలకు మించి ఉండదని నిపుణుల మాట. అదృష్టం బాగుంటే ఈలోపుగానే మరో ఉద్యోగం దొరకొచ్చు. రాకపోయినా ఏడాదిన్నర తర్వాత మళ్లీ కొత్త ఉద్యోగం వెతుక్కుంటూ వస్తుందన్న నమ్మకంతో ఉండాలి. తీరిక లేని బిజీలైఫ్‌లో అనుకోకుండా సెలవులు వచ్చాయని భావిస్తే ఉద్యోగం పోయిందన్న దిగులు ఉండదు.
ఉద్యోగం ఊడిందని ఇదైపోతుంటే.. సెలవులు అనుకోవడం ఏంటి? అంటారా! మన ఆలోచనా సరళిని బట్టి జీవితం ఉంటుంది. మాంద్యమే వచ్చి ఉద్యోగం పోతే.. చేయగలిగేది ఏం ఉండదు. అలాంటప్పుడు బెంగపడి సాధించేది ఏం ఉంటుంది! ఈ సమయంలో అపాయాన్ని ముందే పసిగట్టి ఉపాయంతో గట్టెక్కినవాళ్లే సమర్థులు అనిపించుకుంటారు. భవిష్యత్ అవసరాలకు దాచుకున్న డబ్బును ఇప్పుడు నెలవారీగా వాడుకోవడం ఒక పరిష్కారం. ‘బతికుంటే బలుసాకు తినొచ్చు’ అనే నానుడి ఉండనే ఉందిగా! ఇంట్లో ఆభరణాలు ఉంటే వాటిని కుదువ పెట్టి కష్టకాలాన్ని దాటేయొచ్చు. పిల్లల చదువుకని, ప్లాటు కొందామని దాచుకున్న డబ్బును సైతం నిర్మొహమాటంగా వాడుకోవచ్చు. మళ్లీ ఉద్యోగంలో చేరాక అన్నీ సమకూర్చుకోవచ్చు. అంతేకానీ, ఉద్యోగం పోయిందని, ఇక రాదని నీరుగారిపోతే వ్యక్తిగత సామర్థ్యం మసకబారుతుంది. మాంద్యం ప్రభావం తగ్గిపోయిన తర్వాత కూడా ఉద్యోగాల రేసులో వెనకబడే ప్రమాదం ఉంటుంది! కాకపోతే జీతం వస్తున్నప్పుడు ఖర్చు చేసినట్టు కాకుండా ఆచితూచి వ్యవహరించాలి. అమెజాన్ సీఈవో బెజోస్ చెప్పినట్టు ఆర్భాటాలకు పోతే పొదుపు మొత్తం ఒక్క నెలలోనే కర్పూరంలా కరిగిపోతుంది. అలాకాకుండా, అందుబాటులో ఉన్న డబ్బును అత్యవసరాలకు వినియోగిస్తూ, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మాంద్యంలోనూ బేఫికర్!!
ఉద్యోగం పోయిందని తెలిస్తే ఆప్తులు కూడా అప్పు ఇవ్వని రోజులు ఇవి. అందుకే, ఉద్యోగం కోల్పోతామని బలంగా భావించే వాళ్లు, జాబ్‌లో ఉండగానే పర్సనల్ లోన్ తీసుకోవడం ఒక మార్గం. ఉదాహరణకు నెలకు రూ.70వేలు వేతనం ఉందనుకోండి. రూ.10 లక్షల వరకు రుణం ఇట్టే పుడుతుంది. ఈఎమ్ఐ నెలకు రూ.23వేల వరకు ఉంటుంది. కుటుంబ ఖర్చులకు నెలకు రూ.50 వేలు, రుణం వాయిదా కోసం రూ.23 వేలు వాడుకున్నా.. ఏడాది గడిచిపోతుంది. ఇంకాస్త పొదుపుగా ఉండగలిగితే ఏడాదిన్నర గడిపేయొచ్చు. కొన్ని ఆర్థిక సంస్థలు డ్రాఫ్ట్లోన్ సదుపాయం కూడా కల్పిస్తున్నాయి. మంజూరైన రుణం నుంచి వాడుకున్న మొత్తానికే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. ఏడాది తిరిగేసరికి మాంద్యం ప్రభావమూ తగ్గుతుంది. ఉద్యోగమూ వస్తుంది. తర్వాత తీరుబడిగా రుణ వాయిదాలు చెల్లిస్తే సరిపోతుంది.
– ఎం. రాం ప్రసాద్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in, www.rpwealth.in
“యూపీఐ పేమెంట్స్ తరహాలో బీమా సుగమ్ సక్సెస్ అవుతుందా?!”