Insurance | న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఓవైపు దేశంలో ‘అందరికీ బీమా’ లక్ష్యంతో భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (ఐఆర్డీఏఐ) ముందుకెళ్తుంటే.. మరోవైపు ఏటేటా పాలసీలు తీసుకునేవారి సంఖ్య క్షీణిస్తున్నది. 2047కల్లా ప్రతీ భారతీయునికి బీమా ఉండాలన్నది బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ ఆశయం. కానీ గత రెండు ఆర్థిక సంవత్సరాల తీరును చూస్తే.. ఇది నెరవేరడం అంత ఈజీ కాదని సష్టమైపోతున్నది. అవును.. ఐఆర్డీఏఐ 2023-24 వార్షిక నివేదికలోని వివరాలను చూస్తే ఇంతే మరి.
గత ఆర్థిక సంవత్సరం (2023-24) దేశంలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ (జీడీపీలో వార్షిక ప్రీమియంల నిష్పత్తి) 3.7 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 4 శాతంగా ఉండటం గమనార్హం. ఇక 2021-22లోనైతే 4.2 శాతంగా నమోదైంది. దీంతో ఏండ్లు గడుస్తున్నకొద్దీ కొత్త పాలసీలు అంతకంతకూ పడిపోతున్నాయన్నమాట. ఏటేటా ఇన్సూరెన్స్ కంపెనీలు వసూలు చేస్తున్న బీమా ప్రీమియంల ఆధారంగా ఈ బీమా పెనెట్రేషన్ను అంచనా వేస్తారన్న విషయం తెలిసిందే.
జీవిత బీమాను తీసుకోవడంలో చాలామంది అంతగా ఆసక్తి చూపట్లేదని తాజా ఐఆర్డీఏఐ రిపోర్టు ఆధారంగా తేటతెల్లమవుతున్నది. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన సంవత్సర కాలంలో లైఫ్ ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ వృద్ధిరేటు 2.8 శాతానికి తగ్గుముఖం పట్టింది. అంతకుముందు ఏడాదిలో ఇది 3 శాతంగా ఉన్నది. ఇక నాన్-లైఫ్ కవరేజీలు 1 శాతంతో స్థిరంగా ఉన్నాయి. దీంతో దేశంలో బీమా వ్యాప్తికి మరింతగా కృషి చేయాలని బీమా రంగ సంస్థలకు ఐఆర్డీఏఐ పిలుపునిచ్చింది. వచ్చే 23 ఏండ్లలో (2047 నాటికి) దేశంలోని మొత్తం జనాభాకు బీమా సదుపాయం ఉండేలా శ్రమించాలన్నది.
గత ఆర్థిక సంవత్సరం తలసరి బీమా ప్రీమియం 95 డాలర్లకు పెరిగింది. అంతకుముందు ఇది 92 డాలర్లే. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్‌లో 22 నుంచి 25 డాలర్లకు పెరగగా.. లైఫ్ ఇన్సూరెన్స్‌ల్లో 70 డాలర్లుగానే ఉన్నది. కాగా, 2016-17 నుంచి ఏటా తలసరి బీమా ప్రీమియంలు పెరుగుతూనే ఉన్నట్టు ఐఆర్డీఏఐ చెప్తున్నది. ఇదిలావుంటే గత ఏడాది ప్రపంచ బీమా నమోదులో వృద్ధి 7 శాతంగా ఉన్నది. జీవిత బీమాలో 2.9 శాతంగా, జీవితేతర బీమా పాలసీల్లో 4.1 శాతంగా ఉన్నట్టు అంచనా.
ఇక 2023లో ప్రపంచ తలసరి బీమా ప్రీమియం 889 డాలర్లుగా ఉన్నది. అమెరికా, దక్షిణ కొరియా, బ్రిటన్లలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ వరుసగా 11.9, 11, 9.7 శాతాలుగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాలోనూ 11.5 శాతం నమోదవడం విశేషం. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో 2023-24కుగాను క్లెయిముల నిష్పత్తి స్వల్పంగా తగ్గినట్టు ఐఆర్డీఏఐ తెలిపింది. 82.52 శాతంగా ఉందన్నది. 2022-23లో ఇది 82.95 శాతంగా ఉన్నది.