Paytm- Market Capitalistaion | ఆర్బీఐ నిషేధంతో తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ ‘పేటీఎం’ షేర్ బుధవారం పది శాతం నష్టంతో తాజా లోయర్ సర్క్యూట్’ను తాకింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్)లో ఆర్థిక లావాదేవీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రాథమిక దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. నిధుల దారి మళ్లింపు జరిగినట్లు ఆరోపణలు వస్తే ఈడీ దర్యాప్తు చేస్తుందని ఇంతకుముందు కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఈలో బుధవారం మధ్యాహ్నం 3.10 గంటలకు పేటీఎం షేర్ రూ.342.15 వద్ద ట్రేడయింది. ఇది తాజా లైఫ్ టైం కనిష్టం కావడంతోపాటు తాజాగా మరో 10 శాతం నష్టపోయింది.
గతేడాది అక్టోబర్లో ఆల్ టైం గరిష్ట స్థాయి రూ.998.3 పలికిన పేటీఎం స్క్రిప్ట్.. బుధవారం నాటికి 65 శాతం పతనమైంది. జనవరి 31 నుంచి పేటీఎం షేర్లు 53 శాతం నష్టపోయాయి. గత నెల 31 నుంచి ఇప్పటి వరకు పది సెషన్లలో పేటీఎం రూ.26 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. ఆర్బీఐ నిషేధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా కిరాణా స్టోర్లు తమ దుకాణాల వద్ద ఉన్న `పేటీఎం కరో` ప్రచార స్టిక్కర్లను తొలగిస్తున్నాయి. పేటీఎంపై ఆంక్షలు సమీక్షించే ప్రసక్తి లేదని ఆర్బీఐ తేల్చి చెప్పడంతో ఆ సంస్థ స్టిక్కర్లను కిరాణా సంస్థలు తొలగిస్తున్నాయి. ఒడిదొడుకుల్లో ఉన్న పేటీఎం స్క్రిప్ట్ రూ.275కి పడిపోతుందని గ్లోబల్ బ్రోకింగ్ ఏజెన్సీ మాక్వైర్ అంచనా వేసింది.