Paytm-PPBL | కేవైసీ తదితర రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనందుకు ఆర్బీఐ నిషేధాన్ని ఎదుర్కొంటున్న పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీబీపీఎల్)తో దాని మాతృ సంస్థ ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం – వన్97 కమ్యూనికేషన్స్ తెగదెంపులు చేసుకున్నది. పీపీబీఎల్‌తో తాము చేసుకున్న అంతర్గత ఒప్పందాలను ఉపసంహరించుకుంటున్నామని, ఈ విషయమై తమ మధ్య పరస్పర అంగీకారం కుదిరిందని శుక్రవారం తెలిపింది. కానీ పీపీబీఎల్‌కు, తమకు మధ్య కుదిరిన ఒప్పందాలేమిటో బయట పెట్టలేదు. ఆర్థిక లావాదేవీల నిర్వహణలో పీబీబీఎల్ స్వతంత్ర నిర్వహణ సామర్థ్యం మెరుగు పర్చుకునేందుకు వీలుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది.
ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో తమ ఖాతాదారులు, మర్చంట్లకు నిరంతరాయంగా ఆర్థిక లావాదేవీల సేవలు కొనసాగించడానికి యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, యస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తదితర బ్యాంకులతో పేటీఎం ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పేటీఎం యాప్, క్యూఆర్ కోడ్, సౌండ్ బాక్స్ కార్డ్ మెషిన్లు యధాతథంగా పని చేస్తాయని పేటీఎం పేర్కొంది.
రెగ్యులేటరీ నిబంధనలను అమలు చేయడంలో విఫలమైన పీబీబీఎల్.. ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా గత జనవరి 31న ఆర్బీఐ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తొలుత గత నెల 29 నుంచి ఖాతాదారుల నుంచి డిపాజిట్లు సేకరించరాదని, ప్రీ పెయిడ్ ఇన్ స్ట్రుమెంట్లు, వాలెట్లు, ఫాస్టాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులతో క్రెడిట్ లావాదేవీలు, టాపప్ రుణ వసతులు కల్పించరాదని పేటీఎంను ఆర్బీఐ ఆదేశించింది. అయితే, కస్టమర్లు, మర్చంట్ల సౌకర్యార్థం ఆంక్షల అమలు గడువును మార్చి 15 వరకూ పొడిగించింది.