EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ సోమవారం విడుదల చేసింది. 2014 సెప్టెంబర్ 1నాటికి సర్వీసులో ఉన్నవారు, అటు తర్వాత సర్వీసులో కొనసాగుతున్నవారికి అధిక పెన్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 4 నెలల గడువు మరో రెండు వారాల్లో ముగిసిపోతున్నది. ఈ తరుణంలో హడావుడిగా ఉద్యోగులు, యాజమాన్యాలు అనుసరించాల్సిన విధివిధానాలను ఈపీఎఫ్ఓ జారీచేసింది.
ఈపీఎస్‌కు 2014లో చేసిన సవరణల మేరకు పెన్షనబుల్ వేతన పరిమితిని నెలకు రూ. 6,500 నుంచి రూ. 15,000 కు పెంచి ంది. ఈ పరిమితికి లోబడి అందులో 12 శాతం శాతాన్ని పలు యాజమాన్యాలు పీఎఫ్ కంట్రిబ్యూషన్‌గా ఉద్యోగుల నుంచి డిడెక్ట్ చేయడం జరుగుతున్నది. అంతేమొత్తం యాజమాన్యం సమకూరుస్తున్నది. యాజమాన్యం చెల్లించిన దానిలో 8.33 శాతం ఈపీఎస్‌కు మళ్లిస్తున్నారు. కొన్ని యాజమాన్యాలు వాస్తవ జీతం (బేసిక్+డీఏ)పై ఉద్యోగుల నుంచి డిడెక్ట్ చేస్తూ, అంతమొత్తాన్ని అవి సమకూరుస్తున్నాయి.
అయితే పెన్షన్‌బుల్ వేతన పరిమితిని మించి ఉన్న వాస్తవ వేతనంలో ఈపీఎస్‌కు 8.33 శాతం చెల్లించే అవకాశాన్ని 2014 స్కీమ్ కల్పించి, అధిక పెన్షన్ ఆప్షన్ ఎంచుకోవచ్చని సూచించింది. 2014 సెప్టెంబర్ 1కి ముందు పదవీ విరమణ చేసిన వారు, వాస్తవ జీతంపై పీఎఫ్ డిడెక్ట్ అవుతున్నవారికి (1995 స్కీమ్‌లో ఉన్నవారు) అధిక పెన్షన్ ఆప్షన్‌ను ఈపీఎఫ్‌వో అనుమతించలేదు. గత ఏడాది సుప్రీం కోర్టు తీర్పు మేరకు 2014 సెప్టెంబర్ 1 ముందు వాస్తవ జీతంపై డిడెక్షన్ జరుగుతున్నవారికి (క్యాటగిరి 1 ఉద్యోగులు), అటుతర్వాత సర్వీసు కొనసాగుతున్నవారికి (క్యాటగిరి 2 ఉద్యోగులు) అధిక పెన్షన్ ఎంచుకునే అవకాశం కలిగింది.
అలాగే వాస్తవ వేతనం (బేసిక్+డీఏ)పై అధిక పెన్షన్‌ను ఎంచుకోని క్యాటగిరి 2 ఉద్యోగులకు, సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఇప్పుడు ఎంచుకునే అవకాశం లభించింది. 2014 సెప్టెంబర్ 1 నాటికి, అటుపైనా సర్వీసులో ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. ఎటువంటి ఆప్షన్‌నూ ఎంచుకోకుండా 2014 సెప్టెంబర్ 1కి ముందే పదవీ విరమణ చేసిన వారికి సుప్రీం తీర్పు వర్తించదు. క్యాటగిరి 1 ఉద్యోగులు అధిక పెన్షన్‌కు దరఖాస్తు చేసుకునే మార్గదర్శకాలను 2022 డిసెంబర్లోనే ఈపీఎఫ్ఓ జారీచేసింది. క్యాటగిరీ 2 ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ తాజాగా సర్క్యులర్ విడుదల చేసింది.